ఐపీఎల్ 2026 కోసం ఫ్రాంచైజీలు అప్పుడే సన్నాహాలు ప్రారంభించేశాయి. ఇంటర్నల్ ట్రేడింగ్‌లో భాగంగా ఆటగాళ్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంజూ శామ్సన్ కోసం ఇప్పుడు రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. సంజూ శామ్సన్ కోసం కొత్తగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బేరసారాలు మొదలెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఓ మంచి కెప్టెన్ అవసరం ఉంది. అందుకే ఈ జట్టు యాజమాన్యం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్‌పై కన్నేసింది. సంజూ శామ్సన్‌కు కెప్టెన్‌గా మంచి అనుభవం ఉండటమే కాకుండా అద్బుతమైన బ్యాటర్ కమ్ వికెట్ కీపర్. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్ఆర్ జట్టు ఇతడిని 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరిప్పుడు సంజూని వదులుకుంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ ఆఫర్ చేసింది. సీఎస్కేకు చెందిన ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబేను ఇస్తే సంజూని ఇస్తామని చెప్పింది. అయితే రవీంద్ర జడేజాను వదులుకునేందుకు ఇష్టం లేని సీఎస్కే ఈ ఆఫర్ నిరాకరించింది. దాంతో ఇప్పడు సంజూ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ బేరాలు మొదలెట్టింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లు రమణదీప్ సింగ్, రఘువంశీని ఇచ్చేసి సంజూ శామ్సన్‌ని తీసుకోవాలనుకుంటోంది. అదనంగా 11 కోట్లు కూడా ఇస్తుంది. ఎందుకంటే కేకేఆర్ ఇవ్వాలనుకున్న ఆటగాళ్ల విలువ 7 కోట్లు కాగా సంజూ శామ్సన్ ట్రేడ్ విలువ 18 కోట్లు. కేకేఆర్ చేసిన ప్రతిపాదన ఆర్ఆర్ జట్టుకు బాగానే గిట్టుబాటవుతుంది. ఎందుకంటే రమణదీప్ వంటి మంచి ఫినిషర్ రావడమే కాదు 11 కోట్లు కలిసొస్తాయి.
అందుకే కేకేఆర్ చేసిన ఆఫర్ రాజస్తాన్ రాయల్స్ ఒప్పుకునే అవకాశం కన్పిస్తోంది. సంజూ శామ్సన్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి తనను రిలీజ్ చేయాలంటూ స్వయంగా కోరుకున్నాడు. అందుకే సంజూ కోసం వివిధ ఫ్రాంచైజీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన తరువాత కెప్టెన్‌ను తప్పించి ఘోరమైన తప్పు చేసినట్టుగా విమర్శలు ఎదుర్కొంటున్న కేకేఆర్ జట్టుకు అర్జెంటుగా మంచి అనుభవం కలిగిన కెప్టెన్ కమ్ బ్యాటర్ అవసరం. సంజూ శామ్సన్‌లో ఈ లక్షణాలు ఉండటమే కాకుండా మంచి కీపర్ కూడా కావడంతో కేకేఆర్‌కు మరింత లబ్ది చేకూరనుంది. అందుకే సంజూ కోసం కేకేఆర్ గట్టిగా ప్రయత్నించవచ్చు.