బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. తెలుగు బుల్లితెరపై ఈ షోకు చాలా క్రేజ్ ఉంది. బిగ్‌బాస్‌లో పాల్గొంటే పాపులారిటీ వస్తుంది, కెరీర్ హిట్ అవుతుందనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
బిగ్‌బాస్‌లో పాల్గొనడం వల్ల పాపులారిటీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బులు కూడా భారీగా వస్తాయి. షోలో ఉన్నంతకాలం వారానికి ఇంత చొప్పున ఎన్ని వారాలుంటే అంత డబ్బు ఆ కంటెస్టెంట్ డిమాండ్‌ను బట్టి ఇస్తారు. ఇక టాప్ 5లో నిలిచినవారికి, టాప్ 3 కంటెస్టెంట్లకు, విన్నర్‌కు వచ్చే డబ్బులకు, ఇతర బహుమతులకు కొదవ లేదు. అయితే బిగ్‌బాస్ వల్ల కెరీర్ కూడా సెటిల్ అవుతుంది, సినిమా లేక బుల్లితెరలో అవకాశాలు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతమంది విషయంలో ఇది నిజమైందనేది తెలియదు. అందుకే ఇప్పటి వరకు బిగ్‌బాస్ 8 సీజన్ల విన్నర్లు ఏం చేస్తున్నారు, వారి కెరీర్‌లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనేది చూద్దాం.
బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ పెద్దగా లాభపడింది లేదు. ఎందుకంటే గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా సీరియల్స్ చేసుకుంటున్నాడు. అంటే కెరీర్‌లో పెద్దగా మార్పు రాలేదు. ఇక బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ ప్రశాంత్. షో నడిచినంతకాలం ఎంత పాపులర్ అయ్యాడో షో తరువాత అంత డీగ్రేడ్ అయ్యాడని చెప్పవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌కు ముందే ఇతడి కెరీర్ బాగుండేది.
బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ ప్రముఖ సింగర్ రేవంత్. బిగ్‌బాస్ కంటే ముందే మంచి సింగర్. బిగ్‌బాస్ తరువాత అవకాశాలు పెరగాల్సి ఉంది. కానీ ఏం జరిగిందో మరి..బిగ్‌బాస్ తరువాత రేవంత్ పాడిన పాటలు పెద్దగా లేవనే చెప్పాలి. అడపా దడపా కొన్ని అవకాశాలు వచ్చినా ఏ పాటా హిట్ కాలేదు. బిగ్‌బాస్ సీజన్ సీజన్ 5 విజేత సన్నీ. సన్నీ విషయంలో మాత్రం బిగ్‌బాస్ కెరీర్ పరంగా ఉపయోగపడిందనే చెప్పాలి. అవకాశాలైతే ఇతడికి దండిగా లభించాయి. ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజిత్. నిజం చెప్పాలంటే బిగ్‌బాస్ కంటే ముందు ఒకట్రెండు సినిమాలు, వెబ్‌సిరీస్ చేశాడు. బిగ్‌బాస్ తరువాత ఎలాంటి అవకాశం లభించలేదు. ఇక బిగ్‌బాస్ సీజన్ 3 విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడే అవకాశం వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ విషయంలో బిగ్‌బాస్ హౌస్ కొద్దిగా దోహదపడిందని చెప్పవచ్చు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్‌కు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఓ సినిమా అవకాశం వచ్చినా రాణించలేక చతికిలపడ్డాడు. ప్రస్తుతం అటు సీరియల్స్ ఇటు సినిమాలు రెండూ లేవు. బిగ్‌బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీకు ముందే మంచి పాపులారిటీ ఉంది. బిగ్‌బాస్‌లో వెళ్లడంతో పాపులారిటీ పెరిగిందే తప్ప పెద్దగా సినిమావకాశాలు రాలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే బిగ్‌బాస్ వల్ల విన్నర్లకు డబ్బులొచ్చి ఉండవచ్చు. పాపులారిటీ వచ్చి ఉండవచ్చు కానీ కెరీర్ పరంగా అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి.