రాజకీయ పార్టీకి ప్రధాన బలం కార్యకర్తలు. వారి మద్దతు లేకపోతే.. రాజకీయాల్లో ముందుకు సాగడం.. మనుగడ సాధించడం చాల కష్టం. కార్యకర్తల మద్దతు లేని ఏ పార్టీ బతికి బట్టకట్టినట్లు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. సమాజంలో మార్పు తేవడం కోసం.. ప్రజల తరఫున పాలకులను ప్రశ్నించేందుకు జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అయితే పార్టీ స్థాపించిన ప్రారంభంలో ప్రజల మద్దతు పెద్దగా లభ్యం కాలేదు. కానీ ప్రజా సమస్యలపై జనసేనాని పోరాడుతున్న తీరును చూసి ప్రజలు నెమ్మదిగా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకు కార్యకర్తలను పెంచుకుంటూ.. జనసేన పార్టీ విస్తరిస్తూ పోతుంది.
ఇక తాజాగా పవన్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిశ్చయించారు. దీనిలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. విశాఖపట్నంలో ఎక్కడ చూసిన జనసేన కార్యకర్తలే దర్శనం ఇస్తున్నారు. జోరు వానను సైత లెక్క చేయక.. విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన విశాఖకు తరలివచ్చిన కార్యకర్తల ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఫోటో మాత్రం తెగ వైరలవుతోంది.
దీనిలో జనసేన మహిళా కార్యకర్త ఒకరు చంటి బిడ్డతో విశాఖకు వచ్చింది. అర్థరాత్రి పూట.. బిడ్డను ఒడిలో పెట్టుకుని.. చేతిలో జనసేన జెండా పట్టుకుని.. రోడ్డు పక్కన కూర్చుంది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు.. పైపెచ్చు.. మా నాయకుడు ఉండగా మాకేంటి భయం అన్న ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెను పలకరించారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను జనసేన పార్టీ కార్యకర్తను. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఆయన.. ఏమూల సభ, కార్యక్రమం నిర్వహించినా సరే వెళ్తాను. ఆయన ముఖ్యమంత్రి కావాలి.. అవుతారు’’ అని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియో వైరలవుతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమం నిర్వహించడం.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నం పోలీసులు నగరంలో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని తెలపడంతో.. జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు అయ్యింది. పవన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించడానికిక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా జనవాణితో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు.
ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు విశాఖకు భారీగా తరలి వచ్చారు. కానీ ఉద్రిక్తతల నేపథ్యంలో విశాఖలో ఆంక్షలు విధించడంతో జనసేనాని నోవాటెల్ హోటల్‌కే పరిమితమయ్యారు. ఆయనను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇక నిన్న అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలని విడుదల చేశారు.