బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఈ జిల్లాలకు మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేవు. వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి శనివారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో అయితే పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది.
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నించి భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆరుబయట, చెట్లు, పొలాలు, టవర్ల కింద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, బాపట్ల, తెనాలి, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గత 24 గంటల్లో కడప, కర్నూలు, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఇప్పటికే మూడ్రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో ఐదు రోజులు భారీ వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హన్మకొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్‌లో సాయంత్రం భారీ వర్షం పడనుంది.