బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడుతోంది. ఈ క్రమంలో 3-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికీ భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి వస్తున్న అప్డేట్స్ ఆందోళన కల్గిస్తున్నాయి. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడనుంది. ఫలితంగా రానున్న 3-5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీయనున్నాయి. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
రానున్న 24 గంటల్లో ఏపీలోని ఎన్టీఆర్, ఏలూరు, జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజులు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అల్పపీడనం బలపడుతూ క్రమంగా వాయగుండంగా మారే అవకాశాలున్నాయి. అందుకే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మత్స్యకారుల్ని సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవల్సి ఉంటుంది.
రానున్న 3 రోజుల్లో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. అందుకే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేట పూర్తిగా మానుకుంటే మంచిది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడేటప్పుడు బయట తిరగవద్దు. ప్రస్తుతానికి మాత్రం అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉంది.