జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం మంగళగిరి జనసేన కార్యకర్తల సమావేశంలో విడాకులు, పెళ్లిళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీచేసింది. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చని పవన్ అనడం బాధాకరమని పేర్కొంది. కాగా, మంగళవారం పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తనను మూడు పెళ్లిళ్లపై విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. తాను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిల్లు చేసుకున్నానని అన్నారు.
దానిపై వైఎస్సార్ సీపీ నాయకుల అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ‘ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతారా.. బూతుల పంచాంగం చెప్పే ప్రతీ వైసీపీ నేతకు ఇదే నా హెచ్చరిక. నించోబెట్టి తోలుతీస్తా’ అంటూ మండిపడ్డారు. ఇక, ఇదే వేదికపై ప్యాకేజీ అంటూ తనను విమర్శిస్తున్న వారిపై కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి తనను ప్యాకేజీ తీసుకున్నాడని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానన్నారు. గత 8 ఏళ్ల కాలంలో తాను ఆరు సినిమాలు చేశానని, రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించానని వెల్లడించారు. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టానని, తాను కొత్త వాహనం కొంటే మీకెందుకని ప్రశ్నించారు.