ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలకు కేరాఫ్‌గా మారనుంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలుండగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మరో రెండు విమానాశ్రయాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా మూడు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి, నెల్లూరు, కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే ఆమోదం పొందగా తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాట్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే దిశగా వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది.
ఇవి కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట, కర్నూలు, కడపలో విమానాశ్రయాలు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త విమానాశ్రయాలు అందుబాటులో వస్తే మొత్తం 10 విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంటుంది. నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌పోర్ట్ కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికోసం దామవరం, సున్నపుబట్టి గ్రామాల పరిధిలో భూమిని సేకరించనున్నారు. ఇప్పటికే 669.12 ఎకరాలు సేకరించగా మరో 710.59 ఎకరాలు తీసుకోవల్సి ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విమానాశ్రయం కోసం 1200 ఎకరాలు సేకరించనున్నారు. ఈ రెండు కొత్త ప్రతిపాదిత విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో నిర్మించనున్నారు.
ఏపీలో మినీ ఎయిర్‌పోర్ట్‌లు
మరోవైపు రాష్ట్రంలో మినీ ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హెలీ పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు తీసుకోనుంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా హెలీకాప్టర్లు మాత్రమే నడిచేలా ప్రైవేట్ ఏజెన్సీలను ఆహ్వానించనుంది. ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకు ఎక్కడెక్కడ మినీ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలో నిర్ణయించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు.