రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లాలో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితి ఒక్కసారిగా రణరంగాన్ని తలపిస్తోంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ దాడులు, రాళ్ల వర్షంతో పులివెందుల అట్టుడుకుతోంది. ఆర్.తుమ్మలపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర హింసాత్మకంగా మారింది. మరోవైపు లింగాల మండలం పార్నపల్లెలో పోలింగ్ ప్రారంభం కాకముందే ఉద్రిక్తత పీక్స్‌కు చేరింది. అక్కడకు దూసుకొస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా నడుస్తోంది. అటు పెద్దముడియంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్సెస్ టీడీపీ శ్రేణుల మధ్య నెట్టులాట జరిగింది. జిల్లావ్యాప్తంగా నిమిష నిమిషానికి మారుతున్న పరిస్థితులు తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
పులివెందులలోని ఆర్.తుమ్మలపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులకు తెగబడ్డారు. టీడీపీ వర్గీయులు జరిపినట్టుగా చెప్తున్న రాళ్లు, సీసాల దాడిలో వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. మరోవైపు పులివెందుల పరిధిలోని ఎర్రిపల్లిలోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లను పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై స్థానికులు, ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత మరింత రాజుకుంది.
ఇక లింగాల మండలం పార్నపల్లెలో పరిస్థితి మరింత హైటెన్షన్‌గా మారింది. ఇక్కడ అసలు పోలింగ్ ప్రక్రియే ప్రారంభం కాలేదు. పోలింగ్ బూత్‌లో ఏజెంట్లను కూర్చోబెట్టే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. తమ ఏజెంట్లను బూత్‌లోకి అనుమతించడం లేదంటూ వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు.ఈ సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తక్షణమే పార్నపల్లెకు బయలుదేరారు. అయితే, ఆయన గ్రామంలోకి అడుగుపెడితే పరిస్థితి మరింత చేయిదాటుతుందని భావించిన పోలీసులు.. మార్గమధ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలతో పార్నపల్లె రూట్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి, తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
పులివెందుల సరిహద్దు దాటితే.. పెద్దముడియం మండలం గుండ్లకుంటలోనూ అదే సీన్ రిపీట్ అయింది. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి.. అక్కడ ఉన్న టీడీపీ ఏజెంట్లను బయటకు తోసేయడంతో ఒక్కసారిగా గొడవ రాజుకుంది. టీడీపీ ఏజెంట్లు, వైసీపీ శ్రేణులు ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలపై బలప్రయోగం చేసి, వారిని చెదరగొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పులివెందులతో పాటు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ అల్లరి మూకలను చెదరగొడుతున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భయాందోళనలు తొలగడం లేదు. పోలింగ్ సమయం ముగుస్తున్న కొద్దీ ఈ ఫ్యాక్షన్ జిల్లాల్లో పొలిటికల్ హీట్ ఏ స్థాయికి చేరుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
