ఆంధ్రప్రదేశ్‌లోని MPTC,ZPTC ఎన్నికల సమరానికి కౌంట్‌డౌన్ మొదలయింది! పల్లె పోరులో గెలుపే లక్ష్యంగా పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. అవును.. ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి రసకందాయంలో పడింది. నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. బరిలో నిలిచేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు! ఒక్క తప్పు జరిగినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే ముప్పు ఉండటంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు సిద్ధమవుతుండగా.. ఇటు విశాఖలో ఎన్నికల సామాగ్రి పంపిణీతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే.. జిల్లాలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని 4 జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇక్కడ మొత్తం లక్షా 62 వేల 407 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 1,462 మంది సిబ్బంది పర్యవేక్షణలో 203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. విశాఖలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో అధికారులు ఎన్నికల సామాగ్రిని స్వీకరించి, ఆయా మండలాలకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జెడ్పీ సీఈఓ నారాయణ మూర్తి తెలిపారు. ఇక ఈ ఎన్నికల కోసం మూడు పార్టీలకు ఎస్ఈసీ ఉచిత, ఉమ్మడి చిహ్నాలను కేటాయించింది.
రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. మొత్తం 659 ZPTC స్థానాలకు గానూ 4 స్థానాల్లో వివిధ పరిపాలనా, న్యాయపరమైన కారణాల వల్ల ఎన్నికలను నిలిపివేశారు.మొత్తం 9,829 MPTC స్థానాలకు ఎన్నికలు జరుగుతన్నాయి. ఇందులో 29 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. మొత్తం 2,81,34,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు 1,41,332 మంది ఇతర పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను మూడు రకాలుగా వర్గీకరించింది.
సమస్యాత్మక ప్రాంతాలలో 9,966 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో 9,186 పోలింగ్ కేంద్రాలు.. సాధారణ ప్రాంతాలలో 16,181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
