‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠీ. మొదటి నుండి కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ.. సెలెక్టెడ్ గా డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ పోతుంది. గ్లామర్ పాత్రలకే కాకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య.. ఇప్పటివరకు హిట్స్ తో పాటు వరుస ప్లాప్ లను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రెగ్యులర్ సినిమాలకు బ్రేక్ వేసి కొత్త ధోరణిలో క్రైమ్ కామెడీ మూవీ చేసింది. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’.
ఈ చిత్రం జిన్‌సిటీ అనే కాల్పనిక ప్రపంచంలో రూపొంది పోస్టర్స్ దగ్గరనుండి ట్రైలర్ వరకు అన్నివిధాలా అందరి దృష్టిని ఆకర్షించింది. మత్తు వదలరా మూవీకి పనిచేసిన రితేష్ రానా బృందమే ఈ సినిమాకి కూడా పనిచేయడంతో.. ఈసారి కూడా మంచి ఫన్ రైడ్ మూవీ తీశారనే అంచనాలు ప్రేక్షకులలో ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, నరేష్ అగస్త్య కీలక పాత్రలలో నటించారు. తాజాగా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హ్యాపీ బర్త్ డే చిత్రం.. ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం!
‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ కథ.. జిన్ సిటీ ఫాంటసీ వరల్డ్ లో రిట్జ్ హోటల్ చుట్టూ 7 చాఫ్టర్స్ గా తిరుగుతుంది. అక్కడ రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రిత్విక్ సోధి(వెన్నెల కిషోర్) దేశంలో ప్రతి ఇంట్లో తుపాకీని కలిగి ఉండవచ్చని తుపాకీ సవరణ బిల్లును ప్రవేశపెడతాడు. బిల్లు పాస్ అవ్వడంతో దేశంలో తుపాకీల అమ్మకాలు పెరిగిపోయి గన్స్ బజార్ ని కూడా ఏర్పాటు చేస్తారు. గన్ బజార్ లో జనాలంతా ఎగబడి గన్స్ ని కూరగాయల్లా కొంటారు. ఇక రిట్జ్ గ్రాండ్ హోటల్ లో ఓ ముఖ్యమైన వస్తువు కోసం హౌస్ కీపర్ లక్కీ(నరేష్ అగస్త్య) వెతుకుతుంటాడు. అదే సమయంలో హ్యాపీ త్రిపాఠి (లావణ్య త్రిపాఠి) పబ్‌లోకి ప్రవేశించి.. అనుకోకుండా కిడ్నాప్ లకు గురవుతుంది. కట్ చేస్తే.. కథ అంతా మంత్రి దాచిన ఖజానా వైపు మళ్ళుతుంది. ఈ క్రమంలో హ్యాపీ కిడ్నాపర్స్ నుండి ఎలా తప్పించుకుంది? ఆ తుపాకీ చట్టం ఏమైంది? చివరికి ఈ మూవీ ఏం సందేశం ఇచ్చిందనేది థియేటర్లో చూడాల్సిందే.
ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్ తో రక్షణ మంత్రి రిత్విక్ సోదిగా వెన్నెల కిషోర్ పాత్రను పరిచయం చేస్తూ మొదలైంది. అతను ప్రవేశపెట్టిన గన్ బిల్ తో సినిమా ఆకట్టుకునే కామెడీతో.. నవ్విస్తూ ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తుంది. మొదటగా హ్యాపీ అనే చాప్టర్ తో మొదలైన ఈ సినిమా.. తర్వాత లక్కీ, మాక్స్ పెయిన్ అంటూ ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. అయితే.. హ్యాపీ పాత్రలో లావణ్య త్రిపాఠీ ఎంట్రీ పరవాలేదు అనిపిస్తుంది. కానీ.. కథలో కిడ్నాపులు ఉండేసరికి.. మధ్యలో మాక్స్ పెయిన్ అంటూ కమెడియన్ సత్య ఎంటర్ అవుతాడు.
సత్య కామెడీ టైమింగ్ అందరికి తెలిసిందే. మాక్స్ పెయిన్ గా ఏ-జెడ్ సర్వీసెస్ చేసే విధానం కామెడీగా ఉంటుంది. ఇక కథలోకి హోటల్ హౌస్ కీపర్ లక్కీ(నరేష్ అగస్త్య) క్యారెక్టర్ మూగవాడిలా పరిచయం అవుతుంది. కానీ.. సెకండాఫ్ లో తెలుస్తుంది అతను హాస్పిటల్ లో ఉన్న తల్లికోసం మౌనవ్రతంలో ఉన్నాడని. లక్కీకి ముగ్గురు చెల్లెల్లు తమ మధ్యమధ్యలో వీడియో కాల్ చేయడం టీవీ సీరియల్స్ లో సెంటిమెంట్ ట్రై చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియో కాల్ సీక్వెన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ ని రిట్జ్ హోటల్.. పబ్ నేపథ్యంలో బాగానే రాసుకున్నాడు దర్శకుడు రితేష్.
ట్విస్టులతో పాటు వాటికీ తగిన ఫ్లాష్ బ్యాక్స్.. అంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ తో స్క్రీన్ ప్లే బాగుంది. కానీ.. సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అయ్యేసరికి ప్రేక్షకులు కన్ఫ్యూషన్ కి గురయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఎంట్రీలు.. ట్విస్టులు ఓకే. సెకండాఫ్ లో లావణ్య త్రిపాఠీ డ్యూయెల్ రోల్ అని రివీల్ చేసిన విధానం పెద్దగా ఎక్కదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు అందరూ లావణ్య సింగిల్ రోల్ అనుకుంటారు. కానీ.. సడన్ గా ఇంటర్వెల్ లో మరో లావణ్య ఎంట్రీతో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూషన్ కి గురయ్యారు. సరే.. సెకండాఫ్ లో ఏదైనా బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అంటే.. అది రెగ్యులర్ మూవీస్ లోలాగే ఉండటం నిరాశ కలిగిస్తుంది.
ఫస్ట్ హాఫ్ జాగ్రత్తగా రాసుకున్న డైరెక్టర్.. సెకండాఫ్ లో పూర్తిగా తడబడ్డాడు. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలనీ భావించారు. కానీ.. మ్యాజిక్ క్రియేట్ అవ్వడం పక్కనపెడితే.. ప్రీక్లైమాక్స్ వరకు గజిబిజిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అదీగాక సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గి.. కథలోని కోర్ మిస్ అయ్యింది. సెకండాఫ్ లో గుండాగా రాహుల్ రామకృష్ణ, ఫిక్స్ ఇట్ గా గుండు సుదర్శన్, లావణ్య సెకండ్ రోల్.. బోర్ అనిపిస్తాయి. వీళ్ల క్యారెక్టర్స్ కథాకథనాలను దారి మల్లించినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అంత ఆకట్టుకునేలా లేదు. కానీ.. ప్రీ క్లైమాక్స్ లో కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ ల ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.
మొత్తానికి సెకండాఫ్ లో కొన్ని సీక్వెన్సులు మినహాయిస్తే నీరసంగానే సాగిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ గూడుపుఠాణి చాప్టర్ అంత థ్రిల్లింగ్ గా అనిపించలేదు. పైగా సెకండాఫ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉండటం వలన ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఇక సోషల్ మీడియా పాపులర్ మీమ్స్, డైలాగ్స్ ని బాగా వాడుకున్నాడు డైరెక్టర్. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠీ పరవాలేదు అనిపించింది. నరేష్ అగస్త్య ఓకే అనిపించాడు. మిగతా పాత్రలన్నీ పరవాలేదనిపించాయి. దర్శకుడు రితేష్.. మత్తు వదలరా మూవీతో ఆకట్టుకున్నాడు. కానీ.. హ్యాపీ బర్త్ డేతో తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా.. సెకండాఫ్ బోరింగ్ గా నడిపించాడు.
సాంకేతికంగా సినిమా బాగుంది. సురేష్ సారంగం విజువల్స్, కలర్ ప్యాలెట్స్ కొత్తగా అనిపిస్తాయి. కాలభైరవ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో గందరగోళం ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. కానీ.. హ్యాపీ బర్త్ డే మూవీ అటు డైరెక్టర్ కి, హీరోయిన్ లావణ్యకి హిట్ అందించడంలో సక్సెస్ అవుతుందో లేదో వేచిచూడాలి.
చివరిమాట: ‘హ్యాపీ బర్త్ డే’ ఆలోచన మంచిదే.. ప్రెజెంటేషన్ బెడిసి కొట్టింది!
రేటింగ్: 2/5
గమనిక: ఈ సమీక్ష.. కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!