సాధారణంగా కొందరు తల్లిదండ్రులు ఆడబిడ్డ భారంగా భావిస్తారు. పెళ్లైయిన తరువాత మరొకరి ఇంటికి వెళ్లేదే కదా అనే భావనలో ఉంటారు. కానీ అనుకోని కష్టాలు వచ్చినప్పుడు అదే ఆడబిడ్డ.. అమ్మగా మారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. అలానే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం క్షవరం చేస్తూ పెద్ద దిక్కుగా మారింది ఓ యువతి. ఓవైపు చుదువుకుంటూనే కుటుంబం కోసం తమ కులవృతినే నమ్ముకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బిందు ప్రియా రియల్ స్టోరీ ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన మేడిపల్లి రాజయ్య, స్వరూప దంపతులు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. స్వరూపం రోజూ వారి కూలీ పనులకు వెళ్తుంది. రాజయ్య సొంతూరిలోనే సెలూన్ పెట్టుకుని తన కులవృత్తితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా ముగ్గురు కుమార్తెలను పెంచి పెద్ద చేశారు ఆ దంపతులు. ఇద్దరు అమ్మాయిలకు కూడా వివాహాలు చేశారు. ఇక చిన్న కుమార్తె బిందు ప్రియ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో డిగ్రీ చదువుతోంది. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంపై దేవుడు చిన్నచూపు చూశాడేమో..రాజయ్యకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ భారమంతా స్వరూప మీద పడింది.
తాను సంపాదించే కూలి డబ్బులతోనే ఆ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో ఆ కుటుంబానికి మరో కష్టం వచ్చిపడింది. అనారోగ్యం కారణంగా స్వరూప కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబ కష్టాలు రెట్టింపయ్యాయి. ఓ వైపు తల్లి మృతి .. మరోవైపు మంచాన పడ్డ తండ్రి.. ఇంకో అమ్మాయి అయితే భయపడేది. కానీ రాజయ్య, స్వరూప దంపతుల చిన్న కుమార్తె బిందు ప్రియ ఆ కష్టాలకు కుంగిపోలేదు. తానే భయపడితే ఇక కుటుంబానికి ఎవరు ఆదుకుంటారని భావించింది. కుటుంబ భారాన్ని తన భుజానికెత్తుకుంది. తండ్రి నిర్వహించే బార్బర్ షాపుకెళ్లి తానే కులవృత్తిని చేపట్టింది. క్షవరాలు చేస్తూ వచ్చే ఆదాయంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటోంది.
బిందు ప్రియా గుండె ధైర్యాన్ని చూసిన గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. తనకు కలెక్టర్ కావాలని కోరిక ఉందని.. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా తప్పనిసరై కులవృత్తి చేపట్టాల్సి వచ్చిందని బిందు ప్రియ చెబుతోంది. ఎక్కువ సమయంలో సెలూన్‌కే కేటాయిస్తుండటంతో చదవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరైనా తనకు సాయం చేస్తే తన జీవిత లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతోంది.