మనిషి జీవితం అంటేనే సుఖదుఃఖాలు కలగలసిన సాగర సంగమం. అయితే ఈ రెండు రేయింబవళ్లలాగా మన జీవితాల్లోకి వచ్చి వెళ్తుంటాయి. అయితే కొందరి జీవితం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితాంతం కష్టాల కడలి ఈదుతూనే ఉంటారు. నా అనే వాళ్లు ఎవరు పలకరించకున్న.. కష్టాలు మాత్రం నిత్యం పలకరిస్తుంటాయి. అలాంటి వారి జీవిత కథలు విన్నప్పుడు మనస్సున్న హృదయాలు కరిగిపోతాయి. తాజాగా ఓ ఇద్దరి అన్నాదమ్ములు కథ వింటే హృదయం ద్రవించక ఆగదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ సోదరులు, నడివయస్సుకు వచ్చే సరికి అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం కాలు అడుగు తీసి బయటకి పెట్టలేని దీన స్థితిలో ఆ సోదరులు ఉన్నారు. ఇంతటి దారుణమైన స్థితిలో ఉన్న ఈ సోదరులు సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ కు చెందిన మాణయ్య, అనసూయలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రమేష్, చిన్నవాడు మహేష్. అయితే 12 ఏళ్ల క్రితం అనసూయ కామెర్ల వ్యాధికి గురయ్యారు. అయితే ఆమెకు వైద్యం కోసం మాణయ్య ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. పొలాన్ని అమ్మి అనసూయకు వైద్యం చేయించిన ఫలితం లేకుండా పోయింది. అనసూయ చికిత్స పొందుతూనే మరణించారు. ఇక భార్య మృతితో మాణయ్య తీవ్ర మనస్తాపం చెందాడు. ఆమె మరణించిన ఏడాదిలోపే మాణయ్య కూడా కన్నుమూశారు. తల్లిదండ్రుల మరణంతో పెద్ద కుమారుడు రమేష్ ఏడో తరగతితో చదువు మానేసి.. ఓ హోటల్ పనికి కుదిరాడు. కొన్ని రోజుల తరువాత హోటల్ లో ఉద్యోగం పోవడంతో సొంత ఊరికి వచ్చి చిన్న చిన్న పలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
రమేష్ తాను పనిచేస్తూ తమ్ముడు మహేష్ ను పది వరకు చదివించాడు. ఈ క్రమంలో కొంతకాలానికి రమేష్ కు కాళ్లపై నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత మహేష్ కాళ్లూ కూడా పనిచేయకుండా అయ్యాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి వయస్సు 30 ఏళ్లలోపే ఉంది. ప్రభుత్వం నుంచి ఫించన్ వస్తున్న అవి వారికి జీవనానికి సరిపోవడం లేదు. వీరి జీవనం కోసం పెదనాన్న కిష్టయ్యతో పాటు గ్రామస్థులు ఆర్ధిక సాయం చేస్తున్నారు. అలా జీవితాన్ని నెట్టుకు వస్తున్నా ఇంటి నుంచి బయటకు వెళ్లలేని దీనస్థితిలో ఏర్పడింది. ట్రై సైకిల్ ఉంటే బయటకు వచ్చే ఏదో పని చూసుకోగలరని, అధికారులు మూడు చక్రాల సైకిళ్లు ఇస్తే మేలని స్థానికులు కోరుతున్నారు. మరి.. సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ సోదరులపై మీ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.