వివాహ సమయంలో వేదమంత్రాల సాక్షిగా అన్ని వేళలా తోడునీడగా ఒకరికి ఒకరు ఉంటామని నవ దంపతులు ప్రమాణాలు చేస్తుంటారు. అలా పెళ్లి నాడు చేసిన ప్రమాణాలు ఓ వృద్ధ దంపతుల విషయంలో నిజమయ్యాయి. సుమారు అరవై ఏళ్ల వారి సంసారాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. తమను ఎవ్వరు విడదీయకూడనదే ధృడ నిశ్చయంగా ఉన్నారు. అందుకేనేమో ఆ దంపతులు గంటల వ్యవధిలోనే లోకాన్ని వదిలారు. భార్య చనిపోయిన కొన్ని గంటల్లోనే భర్త మరణించారు. ఈ సంఘటన మహబాబూబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన కందుల కొమ్మాల్ రెడ్డి(80), కొమురమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధప్యం కారణంగా కొమ్మాల్ రెడ్డి ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన భార్య కొమురమ్మ భర్తకు సేవలు చేస్తుంది. ఆయనకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో వారం కిందట ఆమె పక్షవాతానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు కొమురమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న బంధువులంతా ఇనుగుర్తికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
తన భార్య అంత్యక్రియల ఏర్పాట్లను మంచంలోనే ఉండి చూస్తున్న.. కొమ్మాల్ రెడ్డి తీవ్రవేదనకు గురయ్యాడు. తనకు ఇంతకాలం సేవలు చేసిన భార్యను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన కొమ్మాల్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా ఊరిలో విషాదాఛాయాలు అలుముకున్నాయి. మరణంలో కూడా ఇద్దరు కలిసే వెళ్లారంటూ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొమ్మాల్ రెడ్డి అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం ఇద్దరికి ఒకేసారి అత్యక్రియాలు నిర్వహించారు. మరణంలోనే వీడని ఈ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.