ప్రతి స్త్రీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఆ మధురమైన క్షణం కోసం ప్రతి మహిళ ఎదురు చూస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు పునర్జన్మలాంటిది. అయినా తన ప్రాణాన్ని పనంగా పెట్టి.. ఎంతో వేదనను భరించి మరీ.. బిడ్డకు జన్మనిస్తుంది. కొందరు మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో వివిధ కారణాలతో కడుపులోని బిడ్డ చనిపోతుంది. అలానే మరికొన్ని సందర్భాల్లో తల్లీబిడ్డ ఇద్దరూ చనిపోతుంటారు. తాజాగా మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివాల్సిన గర్భిణీ మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త, పుట్టబోయే బిడ్డతో కలిసి హాయిగా జీవించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు కీసరకు చెందిన శేఖర్ తో వివాహం జరిగింది. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలసి జీవిస్తున్నారు. ఇదే సమయంలో లావణ్య తల్లికాబోతోందనే శుభవార్త వారి ఇంట్లో సందడి తెచ్చింది. ఈక్రమంలో లావణ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు శేఖర్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం లావణ్య 5 నెలల గర్భణీ కాగా.. ఇటీవల కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డిసెంబర్ 16న కీసర లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి పంపించారు.
అయితే ఇంటికి వెళ్లిన తరువాత కూడా లావణ్యకు కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ లావణ్యను పరిశీలించిన వైద్యులు పరిస్థితి సీరియస్ గా ఉందని వెంటనే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులోని పిండం సరిగ్గాలేదని చెప్పి.. తొలగించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందింది. అయితే తమ బిడ్డ మరణించడానికి.. ఆమెకు ముందుగా చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి అద్దాలు, ఇతర వస్తువులను సైతం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గర్భిణీగా ఉన్న తన భార్యను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పచ్చకామెర్లు వచ్చాయని చెప్పలేదని , ముందే చెప్పి ఉంటే జాగ్రత్త పడేవారమని మృతురాలి భర్త ఆవేదన చెందాడు. ఆ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరి.. ఇలా వివిధ కారణాలతో గర్భిణీ లు మరణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.