కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కరోనా చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాలు మొత్తం ఆర్థికంగా కుంగిపోయే స్థితికి వచ్చింది. ఉపాది లేక వేల కుంటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే కరోనా కట్టడి చేసేందుకు వైద్యులు ముమ్ముర కృషి చేయడం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఓ వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కరోనా టీకా వేయించుకోవాలని కోరుతుంటే.. కొంత మంది మాత్రం కరోనా టీకా వేయించుకునేందుకు భయపడుతున్నారు.. బద్దకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి అవసరం ఉందని భావిస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా… ఆందోళన కు లోనయ్యారు.
ఈ వార్తలపై స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్, పింఛన్ నిలిపివేస్తామన్న వార్తలు అవాస్తవమని డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకోలేదని చెప్పారు. ఇది తప్పుడు ప్రచారమన్నారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని కోరారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇలాంటి వార్తలు అస్సలు నమ్మవొద్దని పేర్కొన్నారు. మరోవైపు టీకా తీసుకోని వారికి రేషన్, పెన్షన్ బంద్ చేస్తామన్న హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలపై సివిల్ సప్లై అధికారులు స్పందించారు. రేషన్‌కు వ్యాక్సినేషన్‌తో ఎటువంటి సంబంధంలేదని తేల్చి చెప్పారు.