తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ప్రజలు విశ్వాసాన్ని చూపించి రెండో పర్యాయం సీఎం గా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ది కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేసీఆర్. తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలు వ్యాధుల భారిన పడకుండా ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సేవలు అందించేందుకు గాను ప్రత్యేక ఉమెన్ క్లీనిక్ లను ప్రారంభించేందుకు సిద్దమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో మహిళాభివృద్ది కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్న కేసీఆర్ సర్కార్ మహిళలకు మరో శుభవార్త చెప్పింది. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూడటానికి వారి కోసం ప్రత్యేక ఉమెన్ క్లీనిక్ లను ఏర్పాటు చేయడానికి సిద్దమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మహిళల కోసం ప్రత్యేక క్లీనిక్ లను ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 8 న ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఉమెన్ క్లినిక్ లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంద ఉమెన్ క్లీనిక్ లను అందుబాటులోకి తీసుకు వస్తారని.. రాబోయే రోజుల్లో 1200 కేంద్రాల్లో ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రతి మంగళవారం ఈ క్లీనిక్ లు అందుబాటులో ఉంటాయి.
ఈ మహిళా క్లినిక్ లో మహిళలకు 57 రకాల పరీక్షలు చేసి చికిత్సతో పాటు ఉచిత మందులు కూడా పంపినీ చేస్తారు. బీపీ, షుగర్, క్యాన్సర్, రుతుస్రావ పరీక్షలతో పాటు పలు రకాల టెస్టులు చేస్తారని చెబుతున్నారు. అంతేకాదు పరీక్ష చేయించుకున్న 24 గంటల్లోనే రిపార్టులు కూడ వస్తాయని.. వాటికి తగ్గట్టు మెడిసన్ ఇస్తారని అంటున్నారు. మహిళలకు థైరాయిడ్ సహా విటమిన్ పరీక్షలు చూస్తూ.. మహిళల్లో పోషకాహార లోపాలను నివారించడానికి ఈ క్లినిక్ లు సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు. అన్ని వయసుల మహిళలకు ఉమెన్స్ క్లీనిక్ లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారని అంటున్నారు. ఉమెన్ క్లీనిక్ లో ఉండే సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ పోర్టల్ లో ప్రత్యేక లింక్ ను అందుబాటులో ఉంచునున్నారు.
ఇక ఈ క్లీనిక్ కి వచ్చిన మహిళలను అన్ని రకాల టెస్టులు చేస్తారు.. ఏదైనా అనారోగ్యం ఉంటే ప్రాథమికంగా మందులు ఇస్తారు.. టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాత అత్యవసర చికిత్స చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ ని కూడా రూపొందిస్తున్నారు. ఉమెన్ క్లీనిక్ కి వచ్చే మహిళల డిటైల్స్ ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటి రిఫర్ చేసే ఆసుపత్రులకు లింక్ ఏర్పాటు చేయనున్నారు. మహిళలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయన్న వివరాలను వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంది. మొత్తానికి కేసీఆర్ సర్కార్ మార్చి 8 వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది.