పెళ్లి అనేది ఇద్దరు ఇష్ట పూర్వకంగా చేసుకునే ఓ మధురమైన వేడుక. అయితే కొందరు తమకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమాల్లో హీరోహీరోయిన్లు నాటకాలు ఆడినట్లు ఆడుతుంటారు కొందరు యువత. తాజాగా జగిత్యాలలో ఓ ఎన్నారై పెళ్లి కొడుకు కూడా పెళ్లి ఆపేందుకు ఫుల్ డ్రామా క్రియేట్ చేసి అందరిని తెగ కంగారు పెట్టించాడు. చివరకి అతడు అసలు సంగతి బయటపెట్టడంతో పెళ్లి వేడుక ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలోని హనుమ కొండకు చెందిన అన్వేష్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అన్వేష్ కి ఇటీవల జగిత్యాలకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వరకట్నం కింద రూ.25 లక్షలు మాట్లాడుకున్నారు. ఈక్రమంలో వధువు తరపువారు పెళ్లికి ముందుగానే రూ.15 లక్షలు వరుడు తరపు వారికి ముట్ట చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం జగిత్యాలలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరిపేందుకు అన్ని ఏర్పాటు జరిగాయి. కళ్యాణ మండపానికి చేరుకున్న అన్వేష్.. బాత్ రూమ్ లో కాలు జారి పడ్డానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వాళ్లు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
అనంతరం మండపానికి చేరుకున్నాక మరోసారి అనారోగ్యంగా ఉందంటూ బంధువులకు తెలిపాడు. దీంతో నిజమని నమ్మి కుటుంబ సభ్యులు మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. అన్వేష్ ను పరీక్షించిన వైద్యుడు .. ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తెలిపాడు. అయినా ఎదో ఓ కారణం చెప్పి సుమారు ఐదు గంటల పాటు వరుడు హైడ్రామా క్రియేట్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
ఇష్టం లేదన్న విషయం ముందే చెప్పాలి కానీ పెళ్లి పీటల మీదకు వచ్చాక ఇలా చేస్తావా అంటూ వధువు తరపు వారు వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పెద్దలు అడ్డుకున్నారు. ఇరువర్గాలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే పెళ్లికి వచ్చిన అతిధులకు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక తలలు పట్టుకున్నారు.