హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ మద్యాహ్నం నుంచి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని హెచ్చరిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలంటోంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి వాతావరణం గురించి తెలుసుకుందాం.
గత 3-4 రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం నుంచి కుండపోత వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా ఉండటంతో చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా నగర ప్రజలకు ఐఎండీ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ మద్యాహ్నం తరువాత అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది. ఇవాళ మద్యాహ్నం తరువాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మద్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది.
ఇవాళ మద్యాహ్నం దాటిన తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకూ కొనసాగవచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో 25-50 మిల్లీమీటర్ల వరకు పడే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తకూడెం, హనుమకొండ, ములుగు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. సాయంత్రం సమయంలో భారీ వర్షం పడనున్నందున అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.