దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైళ్లు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నాయి. నగరంలో ఉద్యోగాల నిమిత్తం ఉరుకుల పరుగులు తీసే వారికి ఈ మెట్రో రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఎంతో ఉపశమన కలిగిస్తుంది. హైదరాబాద్ లో సైతం మెట్రో రైలు ప్రజలకు చాలా సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న మెట్రో ఛార్జీలే సామాన్యులు భారంగా భావిస్తున్నారు. అయినా ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో దానివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ ఒకటి వచ్చింది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాని కోరింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ నగర ప్రయాణికులపై త్వరలో మెట్రో రైలు ఛార్జీల పిడుగు పడనుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి కల్పించేందుకు ఏర్పాటైన మెట్రో రైలులో జర్నీ మరింత పెరగనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నాలుగేళ్ల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో మెట్రో రైలు సేవలు అందిస్తుంది. ఇటీవల ఛారీల సవరణ కోసం హెచ్ఎమ్ఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థ అభ్యర్ధన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం.. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్ఎఫ్ సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మెట్రో ఛార్జీలపై అధ్యాయనం చేస్తోంది.
ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎల్ అండ్ టీ సంస్థ ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రాజెక్ట్ ను లాభదాయకంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మెట్రో రైలు టిక్కెట్ కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60గా ఉంది. 2017 నవంబరు 28న ఈ ఛార్జీలను నిర్ణయించారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ ఛార్జీలను నిర్ణయించింది. మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ కు మొదటి సారి ఛార్జీలు పెంచే అధికారం ఉంటుంది. సవరించాలంటే కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటికే సాధ్యం.
ఇక మెట్రో రైలు నిర్మాణం ఖర్చు మొత్తం రూ.13 వేల కోట్లు ఎల్ అండ్ టీ సంస్థనే భరించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణం కూడా తీసుకుంది. అలా మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి.. బాగా నడుస్తున్న సమయంలో లాక్ డౌన్ వచ్చింది. ఈ సమయంలో మెట్రో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోయింది. రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కమర్షియల్ రుణాలను ఎల్ అండ్ టీ సంస్థ గ్యారంటీ బాండ్లుగా మార్చి.. వడ్డీని 9శాతం నుంచి6.5 శాతంకి తగ్గించుకుంది. అలానే రూ.3 వేల కోట్లు సాఫ్ట్ రుణం ఇచ్చి.. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
అలానే మెట్రో కోసం ప్రభుత్వం వేర్వేరు ప్రాంతాల్లో భూములను 65 ఏళ్లు లీజుకు ఇచ్చింది. ఈ భూముల నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా ఆదాయం రాబట్టాలని సంస్థ చూస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సాఫ్ట్ లోన్ , తమ ఆధీనంలో ఉన్న భూములను లీజు ఇవ్వడం ద్వారా రూ.5 వేల కోట్లు వస్తే.. రుణ భారం సుమారు రూ.8 వేల కోట్లకు తగ్గుతుందని ఎల్ అండ్ టీ డైరెక్టర్ కిషోర్ సెన్ తెలిపారు. మరి.. త్వరలో మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి అంటు వస్తున్న వార్తల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.