సామాన్యంగా ప్రతి మనిషికి ఉండే కోరిక.. తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండటం. తాను మరణించేలోపు.. తనకంటూ సొంతంగా ఇల్లు కట్టుకుని.. దానిలో గడపాలని భావిస్తాడు. అయితే ప్రసుత్తం ఇంటి నిర్మాణం ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ఆదాయం తప్ప.. అన్నింటి ఖర్చుల పెరిగిపోయాయి. ఈ క్రమంలో గ్రామంలో మామూలు ఇంటి నిర్మాణానికే సుమారు 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఈ మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కాదు కదా.. కనీసం స్థలం కూడా లభించదు. ఇక నగరాల్లో ఓ మోస్తరు ఇల్లు కూడా 30 లక్షల రూపాయల వరకు ఉంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ భాగ్యనగరవాసులకు బంపరాఫర్ ప్రకటించింది. 13-18 లక్షల రూపాయలకే సింగిల్ బెడ్రూం ప్లాట్ అమ్మనుంది. ఆ వివరాలు..
బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీకి సంబంధించి హెచ్ఎండీఏ మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తుదారులు ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ క్రమంలో ఇప్పటికే టోకెన్ అడ్వాన్స్ చెల్లించిన వారందరి పేర్లతో మళ్లీ లాటరీ తీయనున్నట్లు అధికారులు తెలిపారు. బండ్లగూడ, పోచారం రెండు ప్రాంతాల్లో.. సుమారు 3,700 ఫ్లాట్లు ఉండగా.. ఇందులో ఇప్పటి వరకు కేవలం 40 శాతం మాత్రమే లాటరీ ద్వారా అమ్మారు. పైగా లాటరీలో ఫ్లాట్లు దక్కించున్నవారు సైతం డబ్బులు చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో.. మిగిలిన ఫ్లాట్లకు మరోసారి లాటరీ వేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో మిగిలన ఫ్లాట్లకు మరోసారి లాటరీ వేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు సోమవారం ప్రకటించారు. పోచారం, బండ్లగూడ ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూం ఫ్లాట్లు 13-18 లక్షల రూపాయలకు లభించనుండగా.. ట్రిబుల్ బెడ్రూం డీలక్స్ ఫ్లాట్‌ను 50-60 లక్షల రూపాయల్లో పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ వెబ్సైట్లతో పాటు.. 79934 55776, 79934 55791 నంబర్లకు కాల్ చేయాల్సిందిగా అధికారులు తెలిపారు.