ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 2013 పీఆర్సీ బకాయిలను ఈ దీపావళికి అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా చెల్లింపుల కోసం రూ.210 కోట్ల నిధుల విడుదలకు ఆర్థిక శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రూ.2 వేల కోట్లకుపైగా చెల్లింపు బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ఏళ్లుగా బకాయిపడిన 50 శాతం సెక్యూరిటీ బాండ్ల చెల్లింపునకు టీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి వడ్డీతో సహా సెక్యూరిటీ బాండ్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఆర్థికంగా నష్టాల్లో ఉండటం వల్ల టీఎస్ ఆర్టీసీ బకాయిలు అలాగే ఉండిపోయాయి. సీపీఎస్ కు చెల్లించాల్సిన రూ.875 కోట్లు, పీఎఫ్ కు చెల్లించాల్సిన రూ.1,250 కోట్ల బకాయిలు అలాగే ఉండిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఒక్క 2013 పీఆర్సీ 50 శాతం మాత్రమే కాకుండా.. 2017, 2021 పీఆర్ సీ, 5 విడతల డీఏలు సైతం చెల్లించాల్సి ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చెల్లింపులు చేస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో 3 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశం అయ్యారు. ఆ భేటీలో వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు.
ఇప్పుడు బకాయిల మొత్తాన్ని చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి.. దీపావళి కానుకగా రూ.210 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడుదల చేస్తున్న నిధులకు అదనంగా రూ.150 కోట్లు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ గా తీసుకుని ఉద్యోగులకు దీపావళి కానుకగా పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఒక్కో ఆర్టీసీ ఉద్యోగి ఖాతాలో కనిష్టంగా లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల కల కొంత మేర నెరవేరినట్లే అని చెప్పాలి. ఈ వార్త విన్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమకు దీపావళి కాస్త ముందుగానే వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.