తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. రైతుల రుణమాఫీ ప్రక్రియను పున: ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపటి నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్తను అందించారు. రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర రైతాంగం ఆనందంలో మునిగిపోయింది. కాగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నది. అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని పంట పెట్టుబడికి ఆర్థిక సాయం అందిస్తూ రైతన్న సంక్షేమానికి కృషి చేస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో బీడుబారిన భూములు, ఎటుచూసినా కరువు పరిస్థితులు వెక్కిరిస్తుండేవి. నేడు స్వరాష్ట్రంలో పచ్చని పంటలతో కళకళలాడుతూ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది.
సీఎం కేసీఆర్ రైతన్నల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రారంభించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన మేరకు విడతల వారిగా రుణమాఫీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి అనగా ఆగస్టు 3వ తేదీ నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
విడతల వారీగా కొనసాగిస్తూ సెప్టెంబర్ రెండో వారం వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో కోత విధించి రాష్ట్రంపై వివక్ష చూపుతోందని, కరోనా మహమ్మారి వల్ల రుణమాఫీ అమలులో ఆలస్యం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు.