తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మారుతి 800 కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వేములవాడ రాజన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా నల్గొండ జిల్లా బీబీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. కారులో సమ్మయ్య, స్రవంతి, లోకేష్, రాజమణి, భవ్యశ్రీ, వెంకటేష్ మొత్తం 6గురు మంది బీబీ నగర్ నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చారు.
అయితే తిరిగి వెళ్లే క్రమంలో.. మొదట వేములవాడ నుంచి సిరిసిల్ల, ఆ తర్వాత సిరిసిల్ల నుంచి సిద్ధిపేట, అక్కడి నుంచి ప్రజ్ఞాపూర్.. బీబీ నగర్ కి షార్ట్ కట్ రూట్ ఉందని చెప్పి జగదేవ్ పూర్ వైపు వెళ్లారు. మునిగడప గ్రామం చేరుకునే సమయానికి కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్ద ఉన్న కాలువలో కారు పడిపోయింది. స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు కారుని, కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఐదుగురు చనిపోయారని, వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.