తెలంగాణలో ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీలు, మరో వైపు ఆన్సర్ షీట్స్ బండిల్ మాయం ఘటనలు చోటుచేసుకున్న ఈ సమయంలో అధికారులు చేసిన ఓ చర్య వివాదాస్పదమైంది. అధికారుల నిర్లక్ష్య ధోరణితో విద్యార్థుల జీవితాలతో అగమ్యగోచరంగా తయారవుతున్నాయి.
తెలంగాణాలో పదో తరగతి పరీక్షలు ఎంతటి కలకలాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు. తెలుగు, హిందీ పేపర్లు లీక్ కావడం, దానికి కారణమయ్యారంటూ బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేయడం, జైలుకు తరలించడం, ఆపై బెయిల్ పై విడుదల అవ్వడం వంటి పరిణామాలు చకా చకా జరిగిపోయాయి. అయితే ఇదే సమయంలో పదో తరగతి ఆన్సర్ షీట్ల కట్టలు మిస్ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. పోస్ట్ ఆఫీస్ నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తరలిస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైంది. దీంతో పదో తరగతి పిల్లల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. తాజాగా మరో ఉదంతం బయటకు వచ్చింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు తీవ్ర ఉత్కంఠతో ముగిశాయి. అయితే చివరి రోజు అధికారులు చేసిన ఓ పని విమర్శలకు తావునిచ్చినట్లయింది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను కిరాణదుకాణంలో తూకం వేసి పోస్టాఫీసుకు తరలించారు అధికారులు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్లలో చోటుచేసుకుంది. గార్ల బాలికోన్నత పాఠశాల కేంద్రంలో నిర్వహించిన 10వ తరగతి చివరి పరీక్ష సాంఘికశాస్త్రం సమాధాన పత్రాలను కిరాణ దుకాణంలో అధికారులు తూకం వేసుకొని పోస్టాఫీస్‌కు తీసుకెళ్లి పోస్టుమాస్టర్‌కు అప్పగించారు. మామూలుగా విద్యార్థులు రాసిన పరీక్ష జవాబు పత్రాలను ఏరోజుకారోజే పోస్టాఫీసులో తూకం వేసి నిబంధనల ప్రకారం ప్రభుత్వం సూచించిన చిరునామాకు పంపిస్తారు.
కానీ గార్ల పోస్ట్ ఆఫీస్‌లో పెద్ద వేయింగ్ మిషన్ లేకపోవడంతో పదో తరగతి పరీక్ష నిర్వహణ అధికారులు ఆరు బయట ఉన్న కిరాణ దుకాణంలో తూకం వేసి పోస్ట్ చేశారు. దీనిపై పోస్టుమాస్టర్ నాగరాజు మాట్లాడుతూ.. పోస్టాఫీస్‌లో 2 కేజీల బరువు వరకే తూకం ఉందని తెలిపారు. దీంతో పరీక్షల నిర్వాహకులు సమాధాన పత్రాలను బయట దుకాణంలో తూకం వేయించుకొని వస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా పోస్టల్‌శాఖ అధికారులకు 20 కేజీల తూకం కావాలని కోరగా, మంగళవారం ఖమ్మం నుంచి కంప్యూటర్ కాటాను పంపించారని పోస్టుమాస్టర్ చెప్పారు. ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీలు, మరో వైపు ఆన్సర్ షీట్స్ బండిల్ మాయం ఘటనలు చోటుచేసుకున్న ఈ సమయంలో ఇలా తూకం వేసి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.