ఆసియా కప్ 2025కు ప్రకటించిన టీమ్ ఇండియా జట్టుపై వివాదం రేగుతోంది. సమర్ధులకు చోటు దక్కకపోవడం ఓ కారణమైతే..15మందినే ఎంపిక చేయడం మరో కారణం. ఇది సెలెక్షన్ కమిటీ నిర్ణయమా లేక బీసీసీఐ నుంచి ఆదేశాలొచ్చాయా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. జాతీయ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.
మరి కొద్దిరోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15మందితో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన జట్టుని ప్రకటించారు. శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ కాగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, యాదవ్, సంజూ శామ్సన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్‌లతో ఈ జట్టు ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్‌లు స్టాండ్ బై ప్లేయర్లుగా ఉంటారు.
అయితే ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన మొహమ్మద్ సిరాజ్, టీ20లో మంచి ఫామ్ కనబరుస్తున్న శ్రేయస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఏడాదిగా టీ20కు దూరంగా ఉన్న శుభమన్ గిల్‌ను తీసుకొచ్చి వైస్ కెప్టెన్ చేయడంపై సందేహాలు కలుగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ పర్యటనలో రాణించిన ప్రసిద్ధ్ కృష్ణను స్టాండ్ బై చేసి హర్షిత్ రాణాను ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ విమర్శలు కూడా చేశాడు. ఓ ఆటగాడిని ఎలా ఎంపిక చేస్తున్నారు, ఎలా తప్పిస్తున్నారనే అంశానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాడు. అర్హులైనవారిని ఎందుకు తప్పించారో కారణం చెప్పలేకపోతున్నారని మండిపడ్డాడు. యశస్వి జైశ్వాల్‌ను స్టాండ్ బై పెట్టడంలో ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.
17 మందికి అవకాశం ఉంటే 15 మందే ఎందుకు
ఆసియా కప్ 2025కు నిబంధనల ప్రకారం 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ టోర్నీలో పాల్గొనే దాదాపు ప్రతి జట్టు 17 మందితోనే జట్లను సిద్ధం చేస్తోంది. కానీ టీమ్ ఇండియా మాత్రం 15 మందినే ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్చపరుస్తోంది. 17 మందిని ఎంపిక చేసుంటే శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించేది. కానీ ఇలా 15 మందినే ఎంపిక చేయడం వల్ల చాలామందిపై ప్రభావం చూపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలీ నిర్ణయం సెలెక్టర్లదా లేక బీసీసీఐ ఆదేశాలా అనే ప్రశ్న వస్తోంది. బీసీసీఐ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల వల్లే సెలెక్టర్లు 15 మంది జట్టునే సిద్ధం చేశారనే వాదన కూడా విన్పిస్తోంది.