ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటికే ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ప్రతి పక్షాలు ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొలిటికల్ మ్యాప్ ఎలా ఉండబోతుంది.. ఏ పార్టీ పొత్తుల వైపు మొగ్గు చూపుతుంది.. ఒకవేళ పొత్తులు ఏర్పాటు చేసుకున్న పార్టీలు అధిక్యం సాధిస్తే.. అధికారం చేపట్టే విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుమన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్.. జాఫర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై లక్ష్మీ నారాయణ స్పందన ఇలా ఉంది..
ఈ సందర్భంగా జాఫర్.. ‘‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా.. కింగ్ మేకర్ అవుతారా’’ అని ప్రశ్నించాడు. అందుకు వీవీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ‘‘పవన్ కింగ్ అవుతాడా.. కింగ్ మేకరా అవుతాడా అన్న దాని గురించి ఇప్పుడేం చెప్పలేం. ఎన్నికల వేళకు పరిస్థితులు ఎలా మారతాయో.. ఏ పార్టీల మధ్య పొత్తులుంటాయో చెప్పలేం. ప్రస్తుతానికైతే బీజేపీ.. జనసేన తమతో కలిసి ఉందని చెప్పుకుంటుంది. ఇక తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే.. భవిష్యత్తులో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉన్నా.. లేదంటే.. బీజేపీ కూడా చేరి.. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఒకవేళ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి.. అధికారంలోకి వస్తే.. అప్పుడు పవన్ రెండున్నరేళ్లు.. చంద్రబాబు రెండున్నరేళ్లు సీఎంగా పని చేసే అవకాశం ఉంటుంది. కానీ దీని గురించి ఇప్పుడే ఓ అంచానాకు రాలేం’’ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.