జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారని, ఆయన్ని హతమార్చేందుకు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇల్లు, జనసేన పార్టీ కార్యాలయం వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆయన్ని అనుసరిస్తున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నారని జనసేన నాయకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ద్విచక్ర వాహనాలపై అనుసరించారని, బుధవారం కారులో అనుసరించారని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి ఎదురుగా కారు ఆపి గొడవ చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ హత్య కుట్రకు 2019 ఎన్నికల ముందే రూ. 250 కోట్ల డీల్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా తనని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇది వైసీపీ పనే అని జనసేన పార్టీ వర్గాల వారు భావిస్తున్నారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది వైసీపీ వాళ్ళే అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రచారంపై వైసీపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. వైసీపీ పార్టీకి ఎవరిపైనా రెక్కీ నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. శత్రువులు సైతం బాగుండాలని కోరుకుంటామని, మిగతా పార్టీలు కూడా బాగుండాలని భావించే తత్త్వం తమదని అన్నారు.
వైసీపీ పార్టీకి గానీ, వైసీపీ నాయకత్వానికి గానీ, వైసీపీ కార్యకర్తలకి గానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశం, మేలు చేసే ఉద్దేశమే తప్ప వేరే ఆలోచన లేదని అన్నారు. గడప గడపకు వెళ్లి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా అని అడగడం తప్ప ఎవరి మీదనో రెక్కీ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే సమయం తమకు లేదని.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇవి తప్ప వేరే ఆలోచన వైసీపీ పార్టీకి గాని, మా నాయకుడికి గాని, పార్టీ కార్యకర్తలకు గానీ లేవని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎవరు రెక్కీ నిర్వహించారో తెలంగాణ పోలీసులు తెలుసుకుంటారని అన్నారు.