జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఏ1గా, ఆయన కారు డ్రైవర్ ను ఏ2 గా చేర్చి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ నవంబర్ 5న ఇప్పటం గ్రామానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కారు పై భాగంలో కూర్చుని ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటన వల్ల తనకు ప్రమాదం సంభవించిందని తెనాలి మోరిస్ పేటకు చెందిన పి. శివ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం వల్ల తనకు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
నవంబర్ 5న ఇప్పటం రోడ్ మీద బైక్ పై బంధువుల ఇంటికి వెళ్తుండగా.. సుమారు 9.30 గంటల సమయంలో రైల్వే వంతెన దాటే సరికి నేషనల్ హైవే రోడ్డు వైపు నుంచి ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తలు అనేక కార్లు, బైకులతో ర్యాలీగా ఇప్పటం రోడ్డు వైపు వేగంగా వచ్చాయని తెలిపారు. అయితే నిర్లక్ష్యంగా నడపడం వల్ల తాను అదుపు తప్పి కింద పడిపోయానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కారు పై భాగంలో పవన్ కళ్యాణ్ కూర్చుని ఉన్నారని, ఆ కారుని వేగంగా నడిపారని శివ తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ పై, అలానే దీనికి కారణమైన పవన్ పై కేసు నమోదు చేయాలంటూ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
— Hardin (@hardintessa143) November 12, 2022
ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు పవన్ పై ఐపీసీ 336, రెడ్ విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే దీనిపై జనసైనికులు స్పందిస్తున్నారు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోని ఏ వాహనం అతని బైక్ ని ఢీ కొట్టినట్టు అతను ఫిర్యాదులో వెల్లడించలేదని జనసైనికులు అంటున్నారు. ఇక వేగంగా నడపడం వల్ల పడిపోయినట్టు చెబుతున్న దానికి కౌంటర్ గా.. హైవేపై వాహనాలు వేగంగానే వెళ్తాయని జనసైనికులు అంటున్నారు.అయితే కొందరు మాత్రం ఏ క్షణాన అయినా పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.