హైదరాబాద్- ఈ మధ్య కాలంలో పోకిరీలు బాగా పెరిగిపోయారు. అమ్మాయిలను, మహిళలను పనీ పాట లేని వెధవలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్లపైన, నిర్మానుష్య ప్రదేశాల్లోనే వికృత చేష్టలకు పాల్పడే పోకిరీలు, ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా చలరేగిపోతున్నారు. అక్కడా ఇక్కడా ఎందుకని ఏకంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సుల్లో సైతం ఈ దుర్మార్గులు తమ ప్రతాపం చూపిస్తున్నారు.
ఇదిగో ఇలాంటి ఇద్దరు పోకిరీలకు ఓ యువతి ధైర్యం తేసి తగిన శాస్తి చేసింది. షాపింగ్ మాల్ లో వికృత చేష్టలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఆ యువతి పోలీసులకు పట్టించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో ఓ యువతి దుస్తులు కొనుక్కునేందుకు వెళ్లింది. తీరా డ్రెస్ లను ట్రై చేసేందుుకు ట్రయల్ రూంలోకి వెళ్లగా.. యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు.
ఈ విషయాన్ని ఆ యువతి గమినించింది. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన షాపింగ్ మాల్ లోని వారు ఆ యువకులను పట్టుకున్నారు. ఆ తరువాత ఆ యువతి పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. ఇంకేముంది పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా తీసిని వీడియోలను డిలీట్ చేయించారు.
సదరు పోకిరీ యువకులు వీడియో తీసిన మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతే కాదు షాపింగ్ మాల్ మేనేజర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువకుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ లో మరికొన్ని అశ్లీల వీడియోలు ఉన్నట్లు వారు గుర్తించిన పోలీసులు, లోతుగా విచారణ చేపట్టాారు.