తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి పేరు ఖరారైంది. శాంతికుమారిని నూతన సిఎస్ గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సిఎస్ గా ఆమె బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎస్ గా మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే ప్రథమం. తెలంగాణ గత సిఎస్ సోమేశ్ కుమార్ సొంత రాష్ట్రమైన ఏపికి వెళ్లాలంటూ హైకోర్టు సూచించడంతో తదుపరి సిఎస్ ను నియామించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సిఎస్ సోమేశ్ కుమార్ ను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంద్రప్రదేశ్ కు కేటాయించింది. అయితే ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) నుండి అనుమతి తీసుకుని తెలంగాణాకు వచ్చారు. దీనిపై కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుండి వాదనలు కొనసాగుతుండగా సోమవారం హైకోర్టు.. కేంద్రానికి మద్దతుగా తీర్పునిస్తూ.. క్యాట్ ఉత్తర్వులు కొట్టి వేసింది. అయితే దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
కాగా, సోమేశ్ కుమార్ కు రిలీవ్ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే తదుపరి సిఎస్ గా పలు పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ ఐఎఎస్ అధికారులు కె. రామకృష్ణా రావు, అరవింద్, శశాంక్ గోయల్, వసుధా మిశ్రా, అశోక్ కుమార్ పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆ పదవి శాంతికుమారిని వరించింది. 1989 బ్యాచ్ కు చెందిన శాంతి కుమారి, గతంలో సిఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. సిఎస్ గా బాధ్యతలు చేపట్టక ముందు అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన అనుభవముంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీమతి ఎ. శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. pic.twitter.com/EX1HmWoXzQ
— Telangana CMO (@TelanganaCMO) January 11, 2023