న్యూ ఢిల్లీ- చాలా రోజుల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కుటుంబంతో సహా హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిళ్లీ బయలుదేరి వెళ్లారు సీఎం. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. గురువారం ఉదయం ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ టీఆర్ ఎస్ భవన్ కు శంకుస్థాపన చేస్తారు. బుధవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నటీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ సమీపంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. గురువారం భూమి పూజ చేసిన తరువాత, ఏడాదిలోపు పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా, జలశక్తి మంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ తిరిగి రానున్నారు. టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన నేపధ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ ఎస్ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారు.