ఫిల్మ్ డెస్క్- రజినీకాంత్.. ఈ సూపర్ స్టార్ కు భరాత్ లోనే కాదు విదేశాల్లోను అభిమానులున్నారు. రజినీ స్టైల్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రజినీకాంత్ సినిమాలన్నీ ఆయన స్టైల్ వల్లే సక్సెస్ అయ్యాయంటే అతియోశక్తి కాదేమో. ఇక అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లే రజినీ.. ఈ సారి ఏకంగా అమెరికా వెళ్లారు. మామూలుగా వెళ్తే అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కానీ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారాయన. అది కూడా ప్రత్యేక విమానంలో తలైవా అమెరికాకు వెళ్లారు. దీంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. కరోనా నేపధ్యంలో విదేశాలకు విమాన రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మరీ ప్రత్యేక విమానంలో కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు రజినీకాంత్.
కరోనా సమయంలో ఇంత అత్యవసరంగా స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. అసలు కొవిడ్ పరిస్థితుల్లో తలైవా ఎందుకు అమెరికా వెళ్లారని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చాలా కాలంగా ఓ శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళ్లాలని రజనీకాంత్ అనుకుంటున్నారని తమిళ సినీ వర్గాల సమాచారం. ఐతే యేడాదిన్నర కాలంగా కరోనా నేపధ్యంలో ఎప్పటికప్పుడు తన అమెరికా పర్యటన వాయిదా పడుతూ వస్తోందట. దీంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారని చెబుతున్నారు. అంత అత్యవసరంగా రజనీకాంత్ కు చేయాల్సిన ఆపరేషన్ ఎంటన్నది మాత్రం ఎవరికి అంతు పట్టడం లేదు.
ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే తలైవా.. ఈ సారి మాత్రం ఏ సమాచారం ఇవ్వకుండానే అమెరికా వెళ్లిపోయారు. దీంతో అసలు ఏంజరుగుతోందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నాక తలైవా ఏదైనా స్టెట్ మెంట్ ఇవ్వవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అభిమానులే కాకుండా తమిళ సినా పరిశ్రమ వర్గాలు సైతం రజినీ కాంత్ కు ఏమైందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులకు తప్ప మిగతా ఎవ్వరికి వివరాలు తెలియకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక రజినీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న అణ్ణాత్త షూటింగ్‌ను పూర్తి చేసి మరీ అమెరికా వెళ్లారని తెలుస్తోంది. మళ్లీ ఆయన ఎప్పుడు తిరిగి ఇండియాకు వస్తారన్న సమాచారం మాత్రం లేదు.