కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, జీతాలు ఎంత పెరగనున్నాయో క్లారిటీ వస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్దిరోజులుగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నెలతో ముగియనుంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. చివరిసారిగా 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పదేళ్ల తరువాత 8వ వేతన సంఘం కోసం చూస్తున్న పరిస్థితి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెలలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఛైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. దాంతో ఈసారి 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి రాకపోవచ్చు.
8వ వేతన సంఘం అమల్లోకి రాగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయమౌతుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ ఏ మేరకు పెరుగుతుందో తెలుస్తుంది. అందుకే ఉద్యోగులు చాలాకాలంగా కొత్త వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే కమీషన్ నియామకం జరిగి ఉంటే అధ్యయనం పూర్తయి డిసెంబర్ నాటికి నివేదిక వచ్చే అవకాశాలుండేవి. కానీ ఇప్పటి వరకు జరగపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. ఈలోగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ తమ డిమాండ్లను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద కేంద్రానికి సమర్పించింది.
ఈసారి అంటే 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉండవచ్చనే చర్చ నడుస్తోంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే. ఎందుకంటే జీతభత్యాలను నిర్ణయించేది ఇదే. ఇప్పుడున్న కనీస వేతనాన్ని 2.86తో గుణిస్తే వచ్చేదే కొత్త జీతం అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్న కనీస వేతనం 18 వేల రూపాయలు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే కొత్త జీతం 52,380 రూపాయలుగా మారనుంది. అంటే ఉద్యోగులకు జీతం భారీగా పెరుగుతుంది.