గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఖర్చు చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద కొన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతుంది. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనతో పాటు ఆయా గ్రామాల్లోని యువతకు ఉపాధికి తగ్గట్టు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించడమే ఈ పీఎంఏజీవై పథకం యొక్క లక్ష్యం. మరి ఆదర్శ గ్రామాలుగా మీ గ్రామం కూడా అవ్వాలంటే ఏం చేయాలి? మీ గ్రామానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సాధారణంగా ఉన్న గ్రామం ఆదర్శ గ్రామంగా తయారవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? వంటి వివరాలు మీ కోసం.
ప్రతీ గ్రామంలోనూ దళితులు ఉంటారు. షెడ్యూల్ కులాల వాళ్ళు ఎక్కువగా ఉన్న గ్రామాలను, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఖర్చు చేస్తుంది. కనీసం తాగునీటి సదుపాయాలు కూడా లేనటువంటి గ్రామాలను అభివృద్ధి పథంలో పయనించేలా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవై పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక గ్రామంలో 50 శాతానికి పైగా దళితులు ఉంటే అలాంటి గ్రామాన్ని ఈ పథకం కింద అభివృద్ధి చేయడానికి ఎంపిక చేస్తారు. ఆదర్శ గ్రామం కోసం మీ గ్రామం ఎంపిక అవ్వాలంటే గ్రామంలో జనాభా 500 మంది కంటే ఎక్కువ ఉండాలి. అందులో ఎస్సీలు 50 శాతానికి పైగా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ గ్రామాలను ఎంపిక చేస్తాయి.
50 రకాల సామాజిక, ఆర్థిక కొలమానాలను ప్రామాణికంగా తీసుకుని.. అర్హతలు ఉంటే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆ గ్రామాన్ని ఎంపిక చేస్తారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటినీ సమగ్రంగా సర్వే చేస్తారు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తారు. వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. పీఎంఏజీవై పథకానికి కావాల్సిన అర్హతలు ఉంటే ఆ గ్రామాన్ని ఎంపిక చేసి.. రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. మరో లక్ష రూపాయలను పరిపాలన, నిర్వహణ ఖర్చుల కోసం మంజూరు చేస్తారు. అంటే మొత్తం రూ. 21 లక్షల రూపాయలు ఒక గ్రామానికి ఖర్చు పెడతారు. ఈ డబ్బుతో తాగు నీరు, విద్య, వైద్యం, విద్యుత్, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు.
పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లలను ఖచ్చితంగా బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా హాజరయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ పథకానికి ఎంపికైన గ్రామంలో ఇల్లు లేని మనుషులు ఉండరు. అందరికీ పక్కా ఇల్లు ఉండేలా చూసుకుంటారు. ఎవరికైనా ఇల్లు లేకపోతే మంజూరు చేసి నిర్మించి ఇస్తారు. ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్, మంచి నీటి సదుపాయాలు కల్పిస్తారు. ఇక గ్రామంలో పోస్ట్ ఆఫీస్, అంగన్ వాడీ ఏర్పాటు చేస్తారు. గ్రామస్తుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. టెలిఫోన్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామంలో బ్యాంక్ ఉంటే ప్రతి ఒక్కరికీ ఖాతాలు తెరిపిస్తారు. ఒకవేళ బ్యాంకు లేకపోతే.. బిజినెస్ కరస్పాండెంట్ ను ఏర్పాటు చేసి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు.
ఈ పథకానికి ఎంపికైన గ్రామంలో ప్రజలను గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి.. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు, గ్రామ యువజన సంఘాలు, మహిళలు, మహిళా మండలులను భాగస్వామ్యం చేస్తారు. అన్ని అభివృద్ధి పనులూ అయ్యాక.. గ్రామానికి చెందిన యువతకు ఉపాధి కోసం నైపుణ్యం పెంపొందేలా శిక్షణ ఇస్తారు. గ్రామస్తులకు చేతి వృత్తులు, ఇతర ఉపాధి రంగాలకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసియాన్ యువత, గ్రామస్తులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తారు. ఇక వ్యవసాయం చేసే వారికి కూడా సహాయం చేస్తారు. గ్రామంలో ఉన్న వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారు. భూసార పరీక్షలకు సంబంధించి సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేస్తారు.
సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం, సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం, ఆధునిక సాంకేతికతో కూడిన సాగు చేయడం వంటి వాటిలో గ్రామస్తులకు మెలకువలు నేర్పిస్తారు. ఆదర్శ గ్రామానికి ఎంపికైన గ్రామంలో ఈ పథకం 2 ఏళ్ళు అమలులో ఉంటుంది. ఈ రెండేళ్లలో గ్రామాభివృద్ధి పనులు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగింపు కూడా ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లోపు పీఎంఏజీవై పథకం కింద అర్హత ఉన్న అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కనీస సదుపాయాలు లేనటువంటి దళితులు 50 శాతానికి పైగా ఉండే గ్రామాలు దేశంలో 46,884 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకూ 21,850 గ్రామాలు ఆదర్శ గ్రామానికి ఎంపిక కాగా.. 2,487 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
ఒడిశా రాష్ట్రంలో అత్యధికంగా 83 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు. మీ గ్రామం కూడా ఈ పథకంలో ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే https://pmagy.gov.in/new-dashboard/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి.. మీ రాష్ట్రం, సంవత్సరం ఎంపిక చేసి క్లిక్ చేస్తే.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని గ్రామాలు ఈ పథకం కింద ఆదర్శ గ్రామాలుగా మార్చారు, ఎంత నిధులు ఇచ్చారు? ఏవేం పనులు చేపట్టారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రం వారీగా, జిల్లాల వారీగా.. ఏ ఏ గ్రామాలు ఈ పథకం కింద ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద మీ గ్రామం ఉందో లేదో అనే విషయాన్ని హెల్ప్ డెస్క్ నంబర్ +91 11 23070579 కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఎప్పుడైనా సంప్రదించవచ్చు.