ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మద్య వచ్చే గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చంపుకోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం వరకు వెళ్తున్నాయి. ఇక వరకట్న వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మంచిర్యాలకు మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ సతీమణి జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బాలకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. దీంతో తల్లి కాటికి.. తండ్రి జైలుకి వెళ్లడంతో ఇద్దరు పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న ఆ ఇద్దరు చిన్నారులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అంటున్నారు స్థానికులు. జ్యోతి ది ఆత్మహత్య కాదని.. అత్తింటివాళ్లే హత్య చేశారని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జ్యోతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల కోర్టులో హాజరు పర్చగా పద్నాలు రోజులు రిమాండ్ విధించారు. అయితే మంచిర్యాలలో జ్యోతి పోస్ట్ మార్టం చేయకుండా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుపడ్డారు.. ఆత్మహత్యకు కారణమైన బాలకృష్ణ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని పట్టుబట్టారు. దీంతో పలు సెక్షన్ల కింద బాలకృష్ణ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం జ్యోతి పోస్ట్ మార్టానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
ఇదిలా ఉంటే.. జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం.. బాలకృష్ణ రిమాండ్ కి వెళ్లడంతో వారి పిల్లలు రిత్విక్ (8), భవిష్య (6) ఒంటరయ్యారు. ఆస్పత్రి వద్ద జ్యోతి మృతదేహం వద్ద బంధువులు రోధిస్తుంటే.. బిక్కు బిక్కు మంటూ దీనంగా అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారులను చూసి అక్కడ ఉన్నవారు చలించిపోయారు. ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ-తాతయ్య వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఈ కేసు పై ప్రత్యేక దృష్టి సారించారు. జ్యోతి చనిపోవడానికి ముందు ఏం జరిగిందన్న విషయంపై కాల్ డేటా, వాట్సాప్ చాట్ అన్నీ విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నింధితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.