స్పెషల్ డెస్క్- ఇప్పుడు హోం డెలివరీ సదుపాయం వచ్చాక చాలా మంది రిలాక్స్ గా ఉంటున్నారు. మనకు ఏం కావాలన్నా వెంటనే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చిటికెలో ఇంటికి డెలివరీ ఇస్తున్నారు. ఇంట్లో సరకుల నుంచి మొదలు, ఆహారం, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. మరి అన్నీ హోం డెలివరీ ఇస్తున్నప్పుడు.. మందు మాత్రం ఎందుకు హోండెలివరీ చేయరని మందు బాబులకు ఓ చిన్న అసంతృప్తి ఉంది. మధ్యం కూడా హోం డెలివరీ చేస్తే బావుంటుందని చాలా మంది అనుకుంటున్నారు.
మన దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మధ్యాన్ని హోండెలివరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మేరకు సర్వే నిర్వహించారు. మధ్యం ఇంటికే డెలివరీ కావాలని ఎంత మంది కోరుకుంటున్నారనే దానిపై ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా సర్వే చేసింది. మద్యం హోం డెలివరీపై మీ అభిప్రాయమేంటీ, ఇంటికే మందును సరఫరా చేస్తే ఎలా ఉంటుంది, ఆన్ లైన్ ఆర్డర్ కు ఎంత మేర డెలివరీ చార్జ్ చెల్లిస్తారు, మధ్యం హోం డెలివరీని మీరు ఎందుకు కోరుకుంటున్నారు.. వంటి ప్రశ్నలు తెలంగాణ వాసులను అడిగారు.
తెంలగాణతో పాటు మొత్తం 8 రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది. ఇక ఈ సర్వేలో హైదరాబాద్ వాసులు మధ్యం హోండెలివరీకి బాగానే మొగ్గు చూపారు. వంద శాతం హోం డెలివరీని సమర్థిస్తున్నట్టు ఆ సర్వే తేలింది. హైదరాబాద్ తోపాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లోనూ హోం డెలివరీకి డిమాండ్ పెరుగుతోందని సర్వేలో స్పష్టమైంది. సర్వేలో భాగంగా మొత్తం 7,500 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో వంద శాతం మంది హోం డెలివరీని సమర్థించారని సర్వే వెల్లడించింది.
మధ్యం హోండెలివరీ వల్ల కరోనా భారిన పడకుండా ఉండటంతో పాటు, మద్యం కల్తీని కూడా అరికట్ట వచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మధ్యం హోండెలివరీకి గానూ 50 నుంచి 100 రూపాయలు ఛార్జ్ చెల్లించేందుకు మెజార్టీ వినియోగదారులు సముఖుత వ్యక్తం చేశారు. మరి కొంత మంది మాత్రం మధ్యం ఆర్డర్ విలువలో 5 నుంచి 10 శాతం డెలివరీ చార్జీగా తీసుకోవాలని సూచించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎంత మేరకు ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వేను పరిగణలోకి తీసుకుని, రాష్ట్రంలో మధ్యం హోండెలివరీకి అనుమతి ఇస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.