తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన సతీమణికి అస్వస్థతకు గురయ్యారని వార్తలు రాగా, ఆ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు సిటీ స్కాన్, ఎండో స్కోపీ పరీక్షలు చేశారు. ఆయనకు అల్సర్ ఉన్నట్లు తేల్చారు. వెంటనే ఆయనకు చికిత్స కూడా ప్రారంభించారు. తొలుత కేసీఆర్ సతీమణికి అస్వస్థత అని వార్తలు రాగా, కొంత సేపటికీ అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏజీఐ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆయన ఆహారం తీసుకున్నాక కడుపులో అనిశ్చితిగా అనిపించడంతోనే కేసీఆర్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారన్న వార్తలు వస్తున్నాయి. ముందుగా పలువురు వైద్యులు ఇంట్లో ప్రాథమిక చికిత్స అందించగా.. అనంతరం నార్మల్ చెకప్స్ లో భాగంగా ఆయనను ఆసుపత్రికి తరలించి పలు పరీక్షలు చేపట్టారు. ఎండో స్కోపీలో ఆయనకు అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు చికిత్స అందించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన అనారోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనికి ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని, మందులతో తగ్గుతుందని వైద్యులు తెలిపారు. అయితే మరికాసేపట్లో ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. ఆసుపత్రి లోపలికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.