హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చాలా యేళ్లుగా ఏపీ, తెలంగాణల మధ్య రహదారి మార్గం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021- 22 బడ్జెట్‌లో 600 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల, సిద్దేశ్వరం దగ్గర అత్యాధునిక ఐకానిక్ బ్రిడ్జ్.. అంటే తీగల వంతెన నిర్మాణానికి నివేదిక ఇచ్చింది.
నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా గత నెల 21న ఈ ప్రాజెక్టుకు సంబందించిన డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిలోని 76/400 కిలో మీటరు, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలో మీటరు వరకు రహదారిగా గుర్తించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మించాలని నిర్ణయించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఇప్పటికే టూరిజం హబ్‌గా రూపురేఖలు మారాయి. పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో టీరిజం స్పాట్ గా మారనుంది. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ మూడు ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది.
ఈ ప్రతిపాదనల్లో మూడో ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రతిపాదిత సోమశిల రీ అలాన్‌మెంట్ 9.20 కిలో మీటర్ల రహదారి, 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదనలకు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం భారత్ మాల పథకం కింద 173.73 కిలో మీటర్ల రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు 1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న కేబుల్ బ్రిడ్జ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య దూరాన్ని, ప్రయాణ సమయాన్ని ఘణనీయంగా తగ్గించనుంది.