హైదరాబాద్- జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారాయన. అంతే కాదు మరో రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఇటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆరే మళ్లీ పూర్వ వైభవం తేగలరని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందనే చర్చ మొదలైంది. గతంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడు కావడంతో జనాన్ని బాగా ఆకర్షించాడు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఖాయం అనుకున్నారంతా.
కానీ 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హవా తగ్గడంతో అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, నటుడు బాబు మోహన్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. తెలుగు దేశం పార్టీకి బలం చేకూరాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండాల్సిందేనని బాబూమోహన్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ పార్టీ బతకొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తాను కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నట్లు బాబూమోహన్ తెలిపారు.
ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ పార్టీకి పట్టిన ఆ మసి అంతా కడిగేసి వస్తారో, లేక వేరే పార్టీ పేరుతో రంగంలోకి దిగుతారో తెలియదుగా అంటూ బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముందోనని ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.