పంద్రాగస్టున రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. ఒకటి బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అయితే మరొకటి కోలీవుడ్ పాన్ ఇండియా సినిమా. ప్రీ సేల్స్‌లో రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఎవరిది పైచేయి అనేది ఆసక్తిగా మారింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 రెండు సినిమాలకు కావల్సినంత స్టార్ డమ్ ఉంది. అందుకే కలెక్షన్ల విషయంలో రెండూ ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ మొదలై దుమ్ము రేపుతున్నాయి. విడుదలకు వారం రోజుల ముందే ప్రీ సేల్స్ విషయంలో రెండు సినిమాలు ట్రెండ్ సృష్టించేట్టు కన్పిస్తోంది. కచ్చితంగా ఆగస్టు 15 నుంచి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడనున్నాయి. అయితే ప్రీ సేల్స్‌లో మాత్రం వార్ 2 కంటే కూలీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.
కూలీ వర్సెస్ వార్ 2 ప్రీ సేల్స్..
అమెరికా, కెనడాలో కూలీ చిత్రం ప్రీమియర్ షోలు 1160 ఉంటే వార్ 2 సినిమా మాత్రం 1600 షోలు ప్రదర్శించనుంది. వార్ 2తో పోలిస్తే తక్కువ షోలు కలిగి ఉన్నా ప్రీ సేల్స్ మాత్రం కూలీ చిత్రం అధికంగా సాధిస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో కూలీ సినిమా టికెట్లు వేలు విక్రయం కాగా, వార్ 2 కేవలం 7 వేల విక్రయాలు జరిపింది. కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు 2 మిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. తమిళం, తెలుగు వెర్షన్ టికెట్లతో పాటు హిందీ వెర్షన్ కూడా జోరుగా ఉంది. యూకే, సింగపూర్, గల్ఫ్, మలేషియాలో కూడా కూలీ కలెక్షన్లు అధికంగా ఉన్నాయి.
ఇక వార్ 2 సినిమా అయితే 7వేల టికెట్ల ద్వారా 250 వేల డాలర్లు వసూలు చేసింది. సినిమా మాతృక హిందీ అయినప్పటికీ విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో హిందీ కంటే తెలుగు ఎక్కువగా ఉంది. హిందీలో కేవలం 5 వేల డాలర్లే వసూలు చేసింది.