మరో వారం రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ బాలీవుడ్ సినిమా వార్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టికెట్ల విషయంలో నిర్మాతలు రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. పుష్ప 2 దారిని అనుసరించనున్నారు. ఆ వివరాలు మీ కోసం.
యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలతో అందులో ఒకరు టాలీవుడ్ మాస్ హీరోతో వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఓ కీలకమైన అప్‌డేట్ వెలువడింది. టికెట్ల ధరను భారీగా పెంచి అంటే ప్రీమియం ప్రైసింగ్‌తో పుష్ప 2 దారిని అనుసరించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ప్రీమియం ప్రైసింగ్ విధానం
దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఇండస్ట్రీలో హైప్ పెరిగిపోయింది. ప్రీమియం ప్లైసింగ్ విధానమైతేనే బడ్జెట్ కిట్టుబాటు అవుతుందనే అంచనాల్లో మేకర్స్ ఉన్నారు. సినిమా హీరోలు, మాస్ ఫాలోయింగ్, లాంగ్ వీకెండ్‌లో విడుదల కానుండటంతో కలెక్షన్లు భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రీమియం ప్రైసింగ్ ఉంటే అధిక లాభాలు ఆర్జించవచ్చనేది ఆలోచనగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 తరహాలోనే టికెట్లు ఉండవచ్చని సమాచారం. అయితే ఈ నిర్ణయం చాలా రిస్క్‌తో కూడుకున్నదిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప2తో పోల్చేంత కాకపోయినా చాలా అంచనాలు మాత్రం ఉన్నాయి. పుష్ప 2 విడుదలైనప్పుడు మొత్తం ఇండస్ట్రీ షేక్ అయిపోయింది.
కూలీ నుంచి గట్టి పోటీ
మరోవైపు ఇదే రోజు అంటే ఆగస్టు 14న విడుదలవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇప్పటికే కూలీ సినిమా ఓవర్సీస్ ప్రీ సేల్స్ వార్ 2ను దాటేశాయి. వార్ 2 అంచనాలను చేరుకోలేకపోతే మెగా బ్లాక్ బస్టర్ ప్రైసింగ్ విధానం గట్టెక్కవచ్చనేది మేకర్ల ఆలోచనగా తెలుస్తోంది. వార్ 2 మేకర్లు మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రీమియం ప్రైసింగ్ విషయంలో తీసుకుంటున్న రిస్క్ ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.