బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 3-4 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం ఇవాళ సాయంత్రం వరకూ ఏర్పడే అవకాశాలున్నాయి. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షసూచన ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై పెద్దఎత్తున ఉండనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్లు, టవర్ల కింద, ఆరుబయట ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గత కొద్దిరోజులుగా పోటెత్తుతున్న కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం రెండు నదుల్లోనూ ఎలాంటి వరద హెచ్చరికలు అమల్లో లేవు.