బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజమో కాదో తెలియకపోయినా అప్పుడే ట్రోలింగ్ మాత్రం మొదలైపోయింది. పహల్గామ్ దాడి బాధితుని భార్య బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వార్తలో నిజమెంత..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివిధ భాషల్లో ప్రసారమౌతున్న రియాల్టీ షో బిగ్‌బాస్ తాజా వెర్షన్ కూడా మొదలు కానుంది. తెలుగులో సీజన్ 9 ప్రారంభం కానుండగా హిందీలో సీజన్ 19 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో బిగ్‌బాస్ హిందీ సీజన్ 19కు సంబంధించిన కీలక అప్‌డేట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో హనీమూన్ కోసం వెళ్లిన నావికా దళ అధికారి వినయ్ నర్వాల్ ఒకరు. ప్రాణాలు పోగొట్టుకున్న భర్త పక్కన కూర్చుని రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ ఫోటో చాలా వైరల్ అవడమే కాకుండా అందర్నీ కదిలించి వేసింది. ఇప్పుడీమె మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ అంశంలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా చాలామంది ట్రోలింగ్ మొదలెట్టేశారు. భర్త మరణించి ఏడాది కూడా కాలేదు అప్పుడే ఇదేంటంటున్నారు. అసలు ఇది నిజం కాదని మరి కొందరు ఖండిస్తున్నారు.
బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందులో పాల్గొనేవారెవరనేది చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో హిమాన్షి నర్వాల్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. బిగ్‌బాస్ ఓటీటీ 2 విజేతగా నిలిచిన ఎల్విష్ యాదవ్‌కు ఈమె స్నేహితురాలు కావడంతో హిమాన్షి నర్వాల్ కచ్చితంగా బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వాదన కూడా లేకపోలేదు. అసలు ఇదంతా ఫేక్ అని బిగ్‌బాస్ యాజమాన్యం ఆమెను సంప్రదించనే లేదని కొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.