సూపర్ స్టార్ రజనీకాంత్‌కి దైవభక్తి చాలా ఎక్కవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తరచూ అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. అంతేకాక అతి సామాన్య భక్తుడిలాగా దేవస్థానాల్లో గడుపుతుంటారు. ఇప్పటికే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ లోని పలు పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. గతంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించారు. అయితే తాజాగా మరోసారి ఏపీలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సూపర్ స్టార్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. తిరుపతి, కడప దర్గా వంటి ప్రముఖ స్థలాలను రజనీకాంత్ సందర్శించి, ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. వేదపడింతులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారికి తీర్ధ ప్రసాదాలను రజనీకాంత్ కుటుంబానికి అందజేశారు. ఈ సమయంలో రజనీ కాంత్ వెంట ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. అనంతరం తిరుపతి నుంచి కడపకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రఖ్యాతగాంచిన అమీన్ పీర్ దర్గాను దర్శించారు. ఇదే సమయంలో రజనీకాంత్ తో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య, ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ కూడా ఉన్నారు.
దర్గాను సందర్శించిన సమయంలో అక్కడి ఉండే ఫకీర్లను రజనీ కలిశారు. అనంతరం అక్కడ రజనీకాంత్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దర్గా ప్రత్యేకతలను, విశిష్టతను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. దర్గాను సందర్శించే సమయంలో రజనీకాంత్ ప్రత్యేక తలపాగాతో తెల్లటి కూర్తా ధరించి కనిపించారు. దాదాపు రెండు గంటల పాటు దర్గా లో రజనీకాంత్ గడిపారు. ఇక దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. రజనీ రాకతో దర్గా ప్రాంతం ఆయన అభిమానులతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. లాల్ సలామ్ అనే ప్రాజెక్ట్ లో కూతురితో కలిసి రజనీ నటిస్తున్నారు. లైక ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు విశాల్, విక్రాంత్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక మరోకవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ మూవీలో రజనీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశలో ఉంది. ఈ సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన, వినాయకన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.