సౌత్ సినీ ఇండస్ట్రీలో సింగర్ సిద్ శ్రీరామ్ హవా మాములుగా లేదు. తమిళ, తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని సిద్.. తన అద్భుతమైన గాత్రంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో సిద్ శ్రీరామ్ పాట లేకుండా ఆల్బమ్స్ రావట్లేదనే చెప్పాలి. సినిమా పెద్దదా చిన్నదా అనే తేడా లేకుండా అన్ని సినిమాలలో సిద్ శ్రీరామ్ తన మార్క్ చూపిస్తున్నాడు.
ప్రస్తుతం సౌత్ లో ఉన్న మెలోడియస్ గాయకులలో సిద్ శ్రీరామ్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పరిచయం చేసిన సిద్ శ్రీరామ్ వాయిస్.. ముఖ్యంగా తెలుగులో సంచలనం సృష్టిస్తుంది. ఇటీవలి కాలంలో ఏ సినిమా తీసినా మేకర్స్ సిద్ తో ఒక్క పాటైనా పాడించాలని భావిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.నువ్వుంటే నా జతగా, ఇంకేం ఇంకేం కావాలి, మాటే వినదుగా, ఉండిపోరాదే, సామజవరాగమనా, నీలినీలి ఆకాశం, అయ్యయ్యయ్యో, శ్రీవల్లి, రాధేశ్యామ్, హృదయమా లాంటి అనేక పాటలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కొన్నేళ్లుగా సిద్ పాటలే అందరినోటా నానుతున్నాయి. నిజానికి సిద్ పాటల వల్ల కూడా ఓ భాగం జనాలు సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తుంటారు.
ఈ విషయాన్ని సిద్ క్యాష్ చేసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది. పెద్ద బ్యానర్లో సినిమా అయితే తొమ్మిది లక్షల వరకు, చిన్న బ్యానర్ సినిమా అయితే ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది సిద్ శ్రీరామ్ నుండి దాదాపు నలభై పాటల వరకు రానున్నట్లు తెలుస్తుంది. మరి సిద్ శ్రీరామ్ పాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.