భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన అద్భుతమైన ప్రయోగాలతో వెండితెరపై వింతలు సృష్టించిన సెల్యులాయిడ్ సైంటిస్ట్, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త యావత్ భారత సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘోర విషాద సమయంపై టాలీవుడ్‌కు చెందిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాస్ రావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతో కదిలించిందన్నారు. ఆయన నూతన ఆలోచనలను అన్వేషించడంలో కనబరిచిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరుపురాని చిత్రాలను అందించాయని చిరంజీవి అన్నారు. ఆయన సినిమాకు చేసిన సేవను గౌరవంతో ఎల్లప్పుడూ గుర్తించుకుంటామన్నారు చిరు. ఆయన ఇటీవలి చిత్రం ‘సింగ్ గీతం’ కథలు చెప్పడం పట్ల ఆయనకున్న అంతులేని అభిరుచికి ఒక అందమైన నిదర్శనంగా చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు,ఆత్మీయులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు చిరంజీవి.
సింగీతం శ్రీనివాసరావు మరణంపై సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “భారతీయ సినిమా దిగ్గజం ఇక లేరు. భారతీయ చలనచిత్ర రంగం ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు మహేష్ బాబు . సింగీతం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మరోవైపు, విజయ్ దేవరకొండ సైతం ఈ వార్తపై ఎమోషనల్ అయ్యారు. “సింగీతం గారి ఆలోచనలు, ఆయన సృష్టించిన అద్భుతమైన కథలు ఎప్పటికీ మాతోనే ఉంటాయన్నారు. పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమూల్యమని విజయ్ నివాళులర్పించారు.సింగీతం శ్రీనివాసరావు కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ సినిమా గమనాన్ని మార్చిన ఒక దార్శనికుడుగా పలువురు అభివర్ణించారు.
మాటలు లేని మ్యూజికల్ విజువల్ వండర్ పుష్పక విమానం సినిమాతో సంచలనం సృష్టించారు. దాంతో పాటు తెలుగు తెరపై తొలి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ చిత్రం ఆదిత్య 369తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
జానపద, సాహస చిత్రాలతో సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు సింగీతం శ్రీనివాసరావు. భైరవద్వీపం, మయూరి వంటి క్లాసిక్ చిత్రాలు ఆయన మేధస్సుకు నిలువెత్తు సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. వయసు 94 ఏళ్లు దాటినా సినిమాపై ఆయనకున్న తపన తగ్గలేదు. ఇటీవలనే నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించి, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన చురుకైన చిత్రనిర్మాతగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక చారిత్రాత్మక చిత్రం మాయాబజార్ కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సింగీతం ప్రయాణం, ఈరోజుతో ముగియడం చిత్రసీమకు ఎప్పటికీ పూడ్చలేని తీరని లోటని టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు
