జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు కొండగట్టులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం వాడనున్న ప్రచార రథం ‘‘వారాహి’’కి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. జనసేన నేతలు, కార్యకర్తలతో కలిసి కాన్వాయ్‌తో వెళ్లారు. అయితే, ఆయన ప్రయాణిస్తున్న వాహనం భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. హకీంపేట్ వద్ద లారీ రిపేర్ జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పవన్ కల్యాణ్ వాహనం అక్కడే ఆగిపోయింది.
రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉదయం 11 గంటలకు కొండగట్టు చేరుకోవాల్సి ఉంది. అయితే, ట్రాఫిక్ కారణంగా కొండగట్టుకు చేరుకోవటం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ పర్యటనలో భాగంగా మొదట కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కొండగట్టు నుంచే ప్రచార వాహనం ప్రారంభం అవ్వనుంది. అనంతరం ధర్మపురి క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ దర్శించనున్నారు. అనంతరం తెలంగాణలోని జనసేన కీలక నేతలతో సమావేశం కానున్నారు.
కాగా, పవన్ కల్యాణ్ కొండగట్టులోనే వారాహి వాహనానికి పూజలు చేయించటానికి ఓ బలమైన కారణం ఉంది. 2009 ఎన్నికల ప్రచారం కోసం పవన్ కొండగట్టుకు వచ్చినపుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొండగట్టు అంజనేయస్వామి దయ వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన్ కల్యాణ్ బలంగా విశ్వసిస్తారు. అందుకే ఆయన తలపెట్టే ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ కారణంతోనే ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడినుంచి ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. మరి, పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.