తెలుగు సినీ పరిశ్రమకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినా ఇష్టపడి వచ్చి కష్టంతో స్టార్ హోదాను దక్కించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో ఒకరు కింగ్ నాగార్జున. ఇవాళ 66వ ఏట అడుగెట్టిన సందర్భంగా నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తూ..ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికర అంశాలు మీ కోసం..
తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడిగా హృదయాలు కొల్లగొట్టినా, శివతో 90 దశకంలో కాలేజ్ లైఫ్ కళ్లకు గట్టినట్టు చూపించినా, అన్నమయ్యతో ఆధ్యాత్మికతను ప్రవహింపజేసినా అతనికే చెల్లుతుంది. అందుకే నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకున్నాడు. నాగార్జున కేవలం ఓ స్టార్ హీరో మాత్రమే కాదు..ఒక స్కాలర్, ఒక గురువు, ఓ ఫిలాంత్రోపిస్ట్ కూడా. అన్నింటికీ మించి ఎందరికో ప్రేరణ.
రెండేళ్ల వయస్సులోనే సినిమాల్లో…
నాగార్జున అంటే చాలామందికి మొట్ట మొదటి సినిమా విక్రమ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ అంతకంటే ముందే రెండేళ్ల వయస్సులో 1961లో వెలుగు నీడలు సినిమాలో చిన్నారిగా, 1967లో అతని తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తెరకెక్కించిన సుడిగుండాలులో నటించిన సంగతి చాలామందికి తెలియదు. 1986లో విక్రమ్ సినిమాతో మొదటి సారి హీరోగా డెబ్యూ ఇచ్చిన తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
హీరో కంటే ముందు ఆటోమొబైల్ ఇంజనీర్
1986లో టాలీవుడ్‌లో డెబ్యూ కంటే ముందు నాగార్జున ఓ ఆటోమొబైల్ ఇంజనీర్ అని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ నేపధ్యం సినీ పరిశ్రమలో ఎవరికీ ఉండదు. అమెరికాలోని శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. ఆ తరువాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 66 ఏళ్ల వయస్సు వచ్చినా ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఎనర్జెటిక్‌గా ఉండటం నాగార్జున ప్రత్యేకత. దీనికి కారణం అతని డైటింగ్ విధానం. క్రమం తప్పకుండా ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ పాటిస్తాడు. 35 ఏళ్లుగా చేస్తున్న వర్కవుట్స్ అతడిని ఫిట్‌గా ఉంచుతుంటాయి.
వెండి తెర నుంచి బుల్లితెరకు వచ్చిన నాగార్జున మొదటిసారిగా 2014లో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఇప్పటి వరకూ అత్యంత విజయవంతంగా కార్యక్రమం నడిపిస్తున్నాడు. సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు నాగార్జున ఎప్పుడూ వెనుకంజ వేయలేదనే చెప్పాలి. బహుశా అందుకే శివ, అన్నమయ్య, గీతాంజలి వంటి పూర్తి భిన్నమైన సినిమాలు చేయగలిగాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..జపాన్‌లో కూడా నాగార్జునకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివ, బ్రహ్మాస్త్ర, మనం సినిమాలంటే అక్కడి ప్రజలు పడిఛస్తారు. అందుకే గౌరవంగా నాగ్‌ను నాగ్ సమా అని పిల్చుకుంటారు. సమా అంటే గౌరవాన్ని సూచించే బిరుదు. అన్నపూర్ణ స్డూడియోస్ ద్వారా దాదాపు 40 మంది దర్శకులకు అవకాశమిచ్చాడు. ఇటీవల కూలీ సినిమాతో విలన్‌గా డెబ్యూ ఇచ్చి ఇప్పుడు 100వ సినిమాతో బిజీగా ఉన్న నాగార్జునకు హృదయ పూర్వక పుట్టినరోజు కృతజ్ఞతలు