భారీ అంచనాలు, భారీ తారాగణంతో విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నా కొన్ని పాత్రల విషయంలో నెగెటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ మాత్రం దానికి స్టోరీ నెరేషన్ ఏడు సార్లు వినాలా అంటూ పెదవి విరుస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెగెటివ్ లీడ్ రోల్లో నాగార్జున తొలిసారిగా కన్పించిన చిత్రం రజనీకాంత్ నటించిన కూలీ. అంచనాలకు తగ్గట్టే కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తి రేపే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషించిన కింగ్ నాగార్జున స్టోరీని ఏడు సార్లు విన్నాడనేది ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈ విషయాన్ని అటు దర్శకుడు లోకేశ్ కనగరాజ్, కింగ్ నాగార్జున ఇద్దరూ వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. స్టోరీని ఏడు సార్లు విన్నాడనగానే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయ. తీరా సినిమా విడుదలయ్యాక నాగార్జున పాత్రలో ప్రేక్షకులకు కొత్తదనం కన్పించలేదు. వెరైటీ కాన్సెప్ట్ డిజైన్ చేసిన దర్శకుడు సరిగ్గా ప్రజంట్ చేయలేకపోయాడంటున్నారు.
నాగార్జున పాత్ర కంటే ఆ పాత్రకే స్కోప్ ఎక్కువ
చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ప్రతి నాయకుడి పాత్రలో కన్పించిన నాగార్జున సైమన్ పాత్ర కంటే సైమన్ ముఖ్య అనుచరుడిగా, అండర్ కవర్ పోలీస్‌గా దయాళ్ పాత్రలో కన్పించి మెప్పించి సౌబిన్ షాహిర్ పాత్రకు స్కోప్, హైప్ రెండూ ఉన్నాయి. సౌబిన్ షాహిర్ పాత్ర నిడివి కూడా సినిమాలో చాలా ఎక్కువ. సినిమా ఆడినా ఆడకున్నా సౌబిన్ షాహిర్ నటనకు మాత్రం మార్కులు పడిపోయాయి. ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అందుకే నాగార్జున ఏడు సార్లు కధ విని ఇలాంటి పాత్రకు ఎలా ఓకే చెప్పాడంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నాగార్జునకు ఇప్పటికీ సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలు చేసే సత్తా ఉందని..సరైన కంటెంట్ ఉంటే కచ్చితంగా 2-3 వందల కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడంటున్నారు. అందుకే ఇకపై కూలీ తరహా రోల్స్ చేయవద్దంటున్నారు. సపోర్టింగ్ రోల్స్ కంటే సోలో హీరో పాత్రలే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానుల కోర్కెల్ని కింగ్ నాగార్జున ఏ మేరకు పరిగణలో తీసుకుంటారో చూడాలి.