ప్రముఖ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ల ఆయన్ని కాపాడటానికి తీవ్రంగా శ్రమించారు. అయినా లాభంలేకపోయింది. అర్థరాత్రి సమయంలో ఇస్మాయిల్ తుదిశ్వాస విడిచారు. ఇస్మాయిల్ మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందా స్పందిస్తూ..‘‘ ఇస్మాయిల్ మరణం నాకెంతో బాధను కలిగిస్తోంది.
నా కెరీర్ ఆయన సినిమాతోనే మొదలైంది. ఆయన నాకు కేవలం పని ఇవ్వటమే కాదు.. నా మీద చాలా నమ్మకం ఉంచారు. నా మీద నమ్మకం ఉంచిన మొదటి వ్యక్తి ఆయనే. ఓ సామాన్యుడైన గోవింద్ స్టార్ హీరో గోవిందాగా మారటంలో ప్రముఖ పాత్ర పోషించారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించుగాక’’ అని పేర్కొన్నారు. ప్రముఖ సీనియర్ నటి పద్మిని కోల్హాపురి స్పందిస్తూ.. ‘‘ నేను ఆయనతో ‘తోడీసీ బేవఫాయ్, అహిస్ట అహిస్ట సినిమాలు చేశాను. అహిస్ట అహిస్ట నా మనసుకు నచ్చిన సినిమా. ఆయన చాలా పని విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఎల్లప్పుడూ ముఖంపై చిరు నవ్వు ఉండేది.
ఆయనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దాని కోసం కష్టపడేవారు. ఆయన చనిపోవటం ఓ వెలితిగా మిగిలిపోతుంది’’ అని అన్నారు. కాగా, ఇస్మాయిల్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత ‘అగర్’ సినిమాతో దర్శకుడిగా మారారు. తోడీసీ బేవఫాయ్, బులంది, అహిస్ట అహిస్ట వంటి హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2004లో ‘తోడా తుమ్ బద్‌లో తోడా హమ్’ అనే సినిమా దర్శకత్వ వహించారు. ఇది ఆయన చివరి సినిమా. ఈ సినిమాకు ఓ తెలుగు ప్రముఖుడు నిర్మాతగా వ్యవహరించారు.